ఏడుగురు మృగాళ్లు ఓ వివాహితను నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆత్మకూరు: ఏడుగురు మృగాళ్లు ఓ వివాహితను నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో శనివారం వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని నాగలూటి గూడేనికి చెందిన ఓ వివాహితను అదే ప్రాంతానికి చెందిన ఏడుగురు ఈ నెల 6వ తేదీ అపహరించి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. వీరభద్రస్వామి ఆలయం వద్ద ఆమెను నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం బాధితురాలి సోదరుడు మేకలు కాసుకుంటూ అటువైపు వెళ్లాడు.
ఎవరో మూలుగుతున్నట్టు శబ్ధం విని ఆలయం సమీపానికి వెళ్లి చూడగా తన సోదరి నిర్బంధించి ఉండడంతో హతాశుడయ్యాడు. ఆమెను విడిపించి తీసుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి వంటిపై గాయాలు ఉన్నాయి. అత్యాచారం చేసి ఏడుగురి నిందితుల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఏడుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.