తల్లికి చికిత్స కోసం వెళ్తూ.. | For the treatment of her mother .. | Sakshi
Sakshi News home page

తల్లికి చికిత్స కోసం వెళ్తూ..

Jun 26 2014 12:57 AM | Updated on Apr 3 2019 7:53 PM

తల్లికి చికిత్స కోసం వెళ్తూ.. - Sakshi

తల్లికి చికిత్స కోసం వెళ్తూ..

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స చేయించేందుకు తీసుకెళుతున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళిచింది.

  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృత్యువాత
  •  మృతులంతా ఒకే కుటుంబసభ్యులు
  •  వత్సవాయి మండలం కన్నెవీడులో విషాదం
  • చౌటుప్పల్ (నల్లగొండ)/వత్సవాయి : అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి చికిత్స చేయించేందుకు తీసుకెళుతున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళిచింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడుతోపాటు సాయంగా వెళుతున్న సోదరి కూడా కన్నుమూశారు.

    విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామానికి చెందిన కర్నాటి నారాయణ, సంపూర్ణమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోని ఉప్పల్ మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే కొత్తపేటలోని డాక్టర్స్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం వెంకటేశ్వరరావు తండ్రి నారాయణ మృతిచెందారు.

    అప్పటి నుంచి తల్లి సంపూర్ణమ్మ ఇబ్రహీం పట్నంలో కుమార్తె వాసిరెడ్డి రాధ వద్ద ఉంటున్నారు. సంపూర్ణమ్మ(75) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు చికిత్స చేయించేందుకు హైదరాబాద్ తీసుకెళ్లడానికి వెంకటేశ్వరరావు నాలుగు రోజుల కిందట ఇక్కడికి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తల్లి సంపూర్ణ, అక్క వాసిరెడ్డి రాధ(54)తో కలిసి తన కారులో హైదరాబాద్ బయలుదేరారు.

    ఉదయం ఐదు గంటల సమయంలో నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట గ్రామశివారులోని మైలారం క్రాస్‌రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగంలో కూర్చున్న వాసిరెడ్డి రాధ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు(40), సంపూర్ణలను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు.

    వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కారు ఢీకొట్టిన వాహనం ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కన్నెవీడులో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement