సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ రంజాన్, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఉద్యోగులకు మాత్రం రంజాన్, ఆదివారం కూడా సెలవులు ఉండటం లేదు.
ఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్ మౌఖిక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ రంజాన్, ఆదివారాల్లో సెలవులు ఉంటాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఉద్యోగులకు మాత్రం రంజాన్, ఆదివారం కూడా సెలవులు ఉండటం లేదు. ఈ సెలవు రోజుల్లో కూడా పనిచేయాలని మౌఖిక ఆదేశాలు జారీ కావడమే ఇందుకు కారణం. ఈఆర్‌సీ ఇంచార్జి చైర్మన్‌గా శేఖర్‌రెడ్డి ఈ నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా పనిచేయాలంటూ ఆదేశాలు జారీకావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల పెట్టుబడి వ్యయం పెంపుతోపాటు మరికొన్ని ప్రైవేట్ ప్లాంట్లకు అనుకూలంగా కీలక నిర్ణయాలు వెలువరించేందుకు ఈ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈఆర్‌సీ పనితీరు కొంతకాలంగా తీవ్ర విమర్శల పాలవుతోంది. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే సంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ప్లాంట్ల యూనిట్ ధరలను పెంచుతూ గత నెలలో ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకు ఎవరికీ తెలియకుండా విచారణ నిర్వహించారు. దీనిపై విమర్శలు రావడంతో హడావుడిగా రెగ్యులేషన్స్ రూపొందించడం ఈఆర్‌సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమయ్యే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈఆర్‌సీ కేవలం ఇద్దరితోనే నడుస్తోంది. ఇన్‌చార్జి చైర్మన్ పదవీ కాలం ముగుస్తున్నప్పటికీ కొత్త చైర్మన్‌ను ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రభుత్వం నియమించలేదు. దీంతో ఈ నెల 14 నుంచి కేవలం ఒక సభ్యునితోనే ఈఆర్‌సీ కొనసాగనుంది. ఫలితంగా ఈఆర్‌సీకి ఎలాంటి ఆదేశాలు జారీచేసే అధికారం ఉండదు. ఈ నేపథ్యంలో సెలవు దినాల్లో కూడా పనిచేయాలంటూ మౌఖిక ఆదేశాలివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.