జిల్లా అంతటా శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు వేడుకగా జరుపుకున్నారు.
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలు
Aug 10 2013 2:56 AM | Updated on Sep 1 2017 9:45 PM
కాకినాడ, న్యూస్‌లైన్: జిల్లా అంతటా శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు వేడుకగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాసాలు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, పేదలకు అన్న, వస్త్ర దానాలు వంటి కార్యక్రమాలతో ముస్లింలు సంతోషంగా గడిపారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నగరం, మామిడికుదురు వంటి ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ- పిఠాపురం రోడ్డులో ఈద్గా మైదానంలో మత గురువు సుల్తాన్ ప్రత్యేక ప్రార్థనలు చేయగా, పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది ముస్లింలు రంజాన్ వేడుకలకు హాజరయ్యారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో సహా పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
రాజమండ్రి నెహ్రూ నగర్‌లోని ఈద్గా మైదానంలో హజీ ఎండీ అమానుల్లా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు కరీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాయల్ మాస్క్ మసీదులో ఇమామ్ ప్రార్థనలు నిర్వహించగా దానవాయిపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ చేశారు. అమలాపురంలోని షియా మసీద్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని మజ్‌ఫర్ నగర్ నుంచి వచ్చిన మౌలానా సయ్యద్, మహ్మద్ బకరీచౌదరి ప్రార్థనలు చేయించారు. మసీదు అధ్యక్షుడు అల్‌హద్ ఎండీ నిషార్ హుస్సేన్ ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. ముస్లిం పెద్దలు మీర్జా అబీబ్ హుస్సేన్, కర్పర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ముల్లా ముస్తాఫా మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయగా మసీదు పెద్దలు అబీబుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు, నగరం గ్రామాల్లో షియా, సున్నీ మసీదులకు ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్నేహితులందరికీ సేమియా పంచారు.
Advertisement
Advertisement