కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో తాజాగా మరో ఘోరం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఒక గర్భిణి బలైపోయింది. తాళ్లరేవు మండలం గాడిమొగ సమీపంలోని చినవలసలకు చెందిన మల్లేష్, మల్లీశ్వరి దంపతులు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. మళ్లీ ఎనిమిదోనెల గర్భవతి అయిన మల్లీశ్వరి సాధారణ పరీక్షల కోసం ఈ నెల 14న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. ఆ సమయంలో తనకు పడని మందుల జాబితాను వైద్యులకు ఇచ్చింది. ఈ వివరాలు కేస్ షీటులో రాసుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె తనకు పడదని రాసిచి్చన పాంటాప్రొజోల్ ఇంజక్షన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో బాధితురాలి వదిన, ఏఎన్‌ఎం అయిన ధనలక్ష్మి ఆ ఇంజక్షన్ మల్లీశ్వరికి పడదని, చేయవద్దని అడ్డుపడ్డారు.
అయినా వినకుండా డాక్టరు ఆ ఇంజక్షన్ చేశారు. కొద్దిసేపటికే కుప్పకూలిన మల్లీశ్వరిని జీఐసీయూకు తరలించారు. అప్పటికే ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. వైద్యులు ఆమెకు అరగంటకు ఒకసారి సీపీఆర్ చేశారు. దీంతో ధనలక్ష్మి.. మల్లీశ్వరికి ఏమైందో చెప్పాలని, తమవారిని పిలుస్తానని చెప్పారు. ఎవ్వరినీ పిలవొద్దని, బీపీ కాస్త అసాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. చివరకు రాత్రి 11గంటల సమయంలో మల్లీశ్వరి చనిపోయిందని చెప్పారు.
మల్లీశ్వరి మధ్యాహ్నం చనిపోతే కావాలనే వైద్యులు దాచిపెట్టారని మల్లీశ్వరి భర్త మల్లేష్, వదిన ధనలక్ష్మి విలపించారు. వైద్యులు చేసిన ఇంజక్షన్ సీసాను తీసుకుంటుంటే సిబ్బంది అడ్డగించారని తెలిపారు. గొడవేమీ చేయవద్దని, అలా చేస్తే కేసు నమోదవుతుందని, పోస్టుమార్టం చేసి గర్భిణి దేహాన్ని కోయాల్సి ఉంటుందని భయపెట్టారని చెప్పారు. నిస్సహాయస్థితిలో మల్లీశ్వరి మృతదేహాన్ని అర్ధరాత్రి వేళ కాకినాడ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు.


