సొంత భజన.. విమర్శల వాన

CM Chandrababu Campaign In Unguturu Constituency - Sakshi

భీమడోలులో సీఎం సభ తీరిది

జనం లేక సభాప్రాంగణం వెలవెల

ద్వారకాతిరుమల/ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గంలో భీమడోలులో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు జనాదరణ కరువైంది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో ఆది వారం రాత్రి జరిగిన సభలో సొంత డబ్బా కొట్టుకోవడానికి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీ ని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు.  ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడ్డారు. సీఎం సభకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలబోయింది. కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే కష్టం
వైఎస్సార్‌ సీపీ రూలింగ్‌లోకి వస్తే తాము మాట్లాడలేమని, అందుకే ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. తాను ప్రజలకు అన్ని పనులు చేశానని గొప్పలు చెప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మీద కేసీఆర్‌ కక్షగట్టాడని, గుజరాత్‌ కంటే తాను మించిపోతానన్న భయం ఆయన్ను వెంటాడుతుందన్నారు. 

బాబు ముందే నిరసన
పోలవరం అసెంబ్లీ అభ్యర్ధిగా మొడియం శ్రీనివాసరావు వద్దంటూ కొందరు పార్టీ కార్యకర్తలు చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్లకార్డులు ప్రదర్శించారు. నరసాపురం అసెంబ్లీ టికెట్‌ కొత్తపల్లి సుబ్బారాయుడికి ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని వారించారు. 
తాడేపల్లిగూడెం అసెంబ్లీ టికెట్‌ ఆశించి భంగపడ్డ జిల్లాపరిషత్‌ చైర్మన్‌ బాపిరాజును సభావేదికపై చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. బాపిరాజు త్యాగమూర్తి అని, పార్టీ అతన్ని గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు, బండారు మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top