అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ఖర్చులు తడిసి మోపెడు
రూ.36.50 కోట్లు చాలవు.. రూ.40.53 కోట్లు కావాలంటూ కీలక నేత ఒత్తిడి
సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ గతంలో తోసిపుచ్చిన ప్రతిపాదన మరోసారి తెరపైకి
తాజాగా ఏర్పడిన ముళ్ల పొదలు తొలగించేందుకు ఇంకెన్ని కోట్లు కావాలో మరి!
సాక్షి,అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ముళ్ల పొదల తొలగింపు వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. కంప తొలగింపు అంతులేని కథలా సాగుతోంది. ముళ్ల పొదలు తొలగించినందుకు రూ.36.50 కోట్లు ఏమాత్రం సరిపోలేదని.. రూ.40.53 కోట్లు కావాలంటూ ఇప్పటికే సీఆర్‌డీఏ చీఫ్ ఇంజనీర్ పంపిన ప్రతిపాదనను గతేడాది జూన్ 20న సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) తోసిపుచ్చింది. తాజాగా ఓ కీలక నేత ఒత్తిడితో సీఆర్‌డీఏ అధికారులు అదే ప్రతిపాదనను మరోసారి ఈసీకి పంపడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ ముళ్ల కథ..!
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో 29 గ్రామాల పరిధిలోని 217 చ.కి.మీ. (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. తాత్కాలిక నిర్మాణాలకు రూ.కోట్లకు కోట్లు ధారపోసి 2017లో ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో రాజధాని పనులు నత్తనడకన సాగాయి. వర్షాల ప్రభావంతో రాజధాని భూముల్లో ముళ్ల చెట్లు పెరిగి పొదలుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని భూముల్లో ముళ్ల పొదల తొలగింపు పనులు చేపట్టేందుకు రూ.36.50 కోట్లతో సీఆర్‌డీఏ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఆ పనులకు రూ.30,81,54,984 కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 జూలై 10న సీఆర్‌డీఏ సీఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
టెండర్లలో రూ.31,95,56,718.25 కోట్ చేసిన ‘ఎన్‌సీసీ’ సంస్థకు ముళ్ల పొదల తొలగింపు పనులను అప్పగించారు. ముళ్ల పొదల తొలగింపు పనులు పూర్తయ్యాయని, అయితే వ్యయం రూ.31.95 కోట్ల కంటే పెరిగిందని, ఆ మేరకు బిల్లులు చెల్లించాలని సీఆర్‌డీఏను కాంట్రాక్టు సంస్థ కోరింది. దీంతో ముళ్ల పొదల తొలగింపు వ్యయాన్ని రూ.40,53,05,978లకు సవరించాలని సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సీఈ ప్రతిపాదించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ అధ్యక్షతన గతేడాది జూన్ 20న జరిగిన సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ 57వ సమావేశం ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది.
ముళ్ల పొదల తొలగింపు వ్యయం పెంచేందుకు నిరాకరించింది. అయితే ఇప్పుడు ఓ కీలక నేత రంగంలోకి దిగి ముళ్ల పొదల తొలగింపు వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేయడంతో సీఆర్‌డీఏ ఈసీ సమావేశానికి మరోసారి అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మరోవైపు గతేడాది కురిసిన వర్షాలకు రాజధాని ప్రాంతంలో ముళ్ల చెట్లు పెరిగి భారీ పొదలుగా మారాయి. వాటిని తొలగించేందుకు ఇంకెన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. రాజధాని భూముల్లో ముళ్ల పొదల తొలగింపు వ్యవహారం టీవీ సీరియళ్లను తలపిస్తోందంటూ ఇంజనీరింగ్ నిపుణులు, రియల్టర్లు ఛలోక్తులు విసురుతున్నారు.


