జనతంత్రం
అమరావతి అనే పేరుతో ఒక ఎమోషనల్ డ్రామాను రక్తి కట్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం చెమటోడ్చి పనిచేస్తున్నది. ఇప్పుడు మాత్రమే కాదు, ఈ పాలక కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించింది. అప్పటి జగన్ ప్రభుత్వం పాలనాపరమైన విజయాలను మసకబార్చడానికి ‘అమరావతి’ పేరుతో, శోకరస ప్రధానమైన ఇతివృత్తంతో ప్రదర్శించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిపై కురుస్తున్న ప్రశ్నల వర్షాన్ని తప్పించుకోవడానికీ, పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించ డానికీ, అదే నాటకంలో మరిన్ని భావోద్వేగాలను దట్టించడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
రాష్ట్ర విభజన జరిగిన పన్నెండేళ్ల తర్వాత, ప్రధానమంత్రిని రెండుసార్లు రప్పించి శంకుస్థాపన చేసిన తర్వాత... అమరావతే రాజధాని అంటూ మరోమారు అసెంబ్లీ తీర్మానం ఎందుకు? అసెంబ్లీలో అంతర్భాగమైన ఎగువ సభను ఉపేక్షించి ‘అర్ధాంగీ కారం’తోనే పార్లమెంట్‌కు పంపడానికి వేగిరపడిందెందుకు? రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోని అంశమేనని గతంలోనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన తర్వాత... ఈ విషయంలో అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడమనేది చాలా సహజమైన క్రతువు.
కేంద్రంలో ఉన్నది కూడా కూటమి సర్కారే కనుక మొహ మాటం కొద్దీ ఏపీ రాష్ట్ర విభజన (సవరణ) బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి సహకరించింది. ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానా నికి విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు వ్యవహరించరు... ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప! అయినా, సమాజ్‌వాది సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ అమరావతి ఎంపికపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొద్దిపాటి ఖర్చుతోనే సహజసిద్ధంగా ఎదిగే అవకాశమున్న విశాఖను వదిలి అమరావతి పేరుతో మోయలేని భారాన్ని ఎంచుకోవడం పట్ల విస్మయాన్ని ప్రకటించారు.
ఈమాత్రం తతంగానికి శత్రురాజ్యం మీద యుద్ధం చేసి గెలిచినంత హడావిడి చేసింది చంద్రబాబు సర్కార్. ‘కట్టండి తోరణాలు, ఎత్తండి జెండాలు, చేయండి ఉత్సవాలు’ అంటూ కిందిస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అయితే ఆ స్థాయిలో కేడర్ స్పందించలేదన్న సంగతి ఇక్కడ మనకు అనవసరం. అది వారి ఆంతరంగిక విషయం. ‘అమరా వతి ఇక శాశ్వత రాజధాని. దాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ చంద్రబాబు మాట్లాడారు. దేశంలోని సమస్త పార్టీలూ ఒక్క తాటిపై నిలిచి అమరావతికి మద్దతు తెలిపాయని చెబుతూ ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని బాబు తప్పుబట్టారు.
ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నామని ఉభయ సభల్లో వైసీపీ సభ్యులు చెప్పారు. అమరావతిని వ్యతిరేకిస్తున్నా మని చెప్పలేదు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులో పెట్టలేకపోయినా అప్పటి ప్రధాని ప్రభుత్వం తరఫున ఏపీకి ‘ప్రత్యేక హోదా’ను హామీ ఇచ్చారు. ఆ ‘ప్రత్యేక హోదా’ అనేది ఏపీకి సంజీవని వంటిదని జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయ పడ్డారు. మొన్న పార్లమెంట్ ఆమోదించిన బిల్లు 2014 నాటి విభజన చట్టానికి సవరణ కనుక ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది?
వైసీపీ సభ్యులు అదే ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను బిల్లులో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. రాజధాని భూసమీకరణకు సహకరించిన రైతుల గురించి బిల్లులో ఎందుకు లేదని అడిగారు. ఇంకెన్నాళ్లకు వారికి న్యాయం జరుగు తుందని కడిగేశారు. రాజధాని నిర్మాణ పనుల పేరుతో ఆమో దించిన టెండర్లలో కనిపిస్తున్న కనీవినీ ఎరుగని అవినీతి వ్యవహారాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఢిల్లీలో చదరపు అడుగుకు నాలుగు వేలున్న నిర్మాణ వ్యయం అమరావతిలో పన్నెండు వేలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను గతంలో పలుమార్లు స్వయంగా ప్రతిపక్ష నేత కూడా వేసినా, ప్రభుత్వం స్పందించలేదు.
ఈ అవినీతిని ఎత్తిచూపకుండా పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు మద్దతునిస్తే రాష్ట్ర సర్కార్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు కాదా? బేషరతుగా బిల్లుకు మద్దతునిచ్చి ఉంటే ప్రతిపక్ష బాధ్యతలో వైసీపీ విఫలమైనట్టు భావించవలసి వచ్చేది. అందుకే సవరణ బిల్లును ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాగా మార్చి ప్రచారం చేయడానికి కూటమి పార్టీల నేతలు, యెల్లో మీడియా వారు వీరకంకణాలు ధరించారు. అమరావతి నిర్మాణాన్నీ, అభివృద్ధినీ వైసీపీ అడ్డుకుంటున్నదని ప్రచార సంరంభాన్ని ప్రారంభించారు. రాజధాని పేరుతో ఎంత విచ్చలవిడిగా అవినీతి చెలరేగినా ప్రశ్నించ కూడదా? ప్రత్యేక హోదా డిమాండ్‌కు పాలక కూటమి మంగళం పాడితే ప్రతిపక్షం కూడా కోరస్ పాడాలా? చట్టబద్ధత అనేది అమరావతికి మాత్రమే ఉండాలా? అందుకోసం భూములిచ్చిన రైతులకు చట్టపరమైన రక్షణ అవసరం లేదా?... ఇవి కదా ఇప్పుడు చర్చ జరగవలసిన ప్రధానాంశాలు!
అసలీ చట్టబద్ధత అనేదే పెద్ద బోగస్. దీన్నేమీ రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చలేదు కదా, మార్చకుండా ఉండ టానికి? చట్ట సవరణ కోసం ఏపీ శాసనసభ ఎంత సులభంగా మొన్న తీర్మానం చేసిందో, కావాలనుకుంటే ఇంకో ప్రభుత్వం అంతే సులభంగా ఇంకో తీర్మానాన్ని కూడా చేసి కేంద్రానికి పంపించగలదు. తమకిచ్చిన హామీలు నెరవేరక, చూపెట్టిన రంగుల చిత్రాలు నిజం కాక నిరాశతో ఉన్న రైతులను మరి కొంతకాలం మభ్యపెట్టడానికీ, రెండో విడత భూసేకరణకు సిద్ధపడని రైతులను బుజ్జగించడానికీ, నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాల నుంచి దృష్టి మళ్లించడానికీ పన్నిన వ్యూహం తప్ప ఈ చట్టసవరణకు ఇంతకు మించిన ప్రాధాన్యంలేదు.
విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి తన ఆనందాన్నీ, ప్రతిపక్షం మీద ఆక్రోశాన్నీ వెలిబుచ్చుతున్న సందర్భంలో ఒక కీలకమైన అంశం ఆయన మాటల్లోంచి దొర్లిపడింది. ‘రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ, ఒక్కరోజులో పూర్తయ్యేది కాద’ని చంద్రబాబు చెప్పారు. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కాలేదన్న నానుడి చంద్రబాబు దాకా చేరేసరికి శతాబ్దాల కాలం పట్టిందన్నమాట! ఆంధ్రప్రదేశ్‌కు గ్రోత్ ఇంజన్ లాంటి నగరంగా అమరావతిని నిర్మించాలన్నది తన లక్ష్యమని కూడా ఆయన పలుమార్లు చెప్పారు. రెండో విడత, మూడో విడత భూసమీకరణ సంగతిని పక్కన పెడదాం. మొదటి విడత 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకే బాబు లెక్క ప్రకారం లక్ష కోట్లు కావాలి.
ఇప్పటివరకు రాజధాని పేరుతో చేసిన రూ. 47 వేల కోట్ల అప్పుల్లో చాలాభాగం ఐకానిక్ బిల్డింగ్‌ల ఖాతాల్లోకి మళ్లింది. తొలివిడత మౌలిక వసతులను పూర్తిచేయడానికి ఇంకెన్ని వేల కోట్లు కావాలి? ఎప్పటికి సమకూరాలి? ఓ దశాబ్దానికో, రెండు దశాబ్దాలకో మౌలిక వసతుల్ని, ప్రభుత్వ భవనాలను, ప్రైవేట్ సంస్థల భవనాలను పూర్తి చేసినా, జనసమ్మర్దం నివసించే నగరంగా మారే అవకాశాలు అమరావతికి చాలా తక్కు వని నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్ పూర్‌గానో, మలేసియాలోని పుత్రజయగానో చీకటి పడగానే నిర్మానుష్య నగరంగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని సాధికారికంగా వివరిస్తున్నారు. ఇటువంటి నగరం ఎన్ని తరాలు గడిస్తే గ్రోత్ ఇంజన్‌గా ఎదగగలుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
ఈ నేపథ్యంలోనే గతంలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను పరిశీలించాలి. హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైన కారణంగా మిగిలిన ప్రాంతాలు వెనుక బడ్డాయనీ, విభజిత రాష్ట్రంలో అటువంటి పొరపాటు చేయ వద్దనీ రాజధానిపై కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పాలనా వికేంద్రీ కరణ కూడా ప్రజాస్వామ్యం బలపడేందుకు దోహదపడుతుంది. దీనితోపాటు మరో ముఖ్యమైన విషయం– రాష్ట్రాభివృద్ధికి దోహదపడే గ్రోత్ ఇంజన్ లాంటి నగరం కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలో అంతర్లీనంగా ఉన్నది.
విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. షిప్‌యార్డ్, తూర్పు నావికాదళం, స్టీల్ ఫ్యాక్టరీ వగైరాల ఏర్పాటుతో కాస్మొ పాలిటన్ స్వరూపాన్ని సంతరించుకున్నది. బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒరిస్సాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలో విశాఖను గ్రోత్ ఇంజన్‌గా అందుబాటులోకి తీసుకొని రావచ్చు. దాంతో పాటు కర్నూలు న్యాయ రాజధాని విషయం కూడా!
మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో కర్నూలులో రాజధాని ఏర్పాట యింది. మూడేళ్ల తర్వాత రాయలసీమ ప్రాంతం తన రాజధాని హోదాను త్యాగం చేసి దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పా టుకు శ్రీకారం చుట్టింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విచ్ఛిన్నమై పాత ఆంధ్ర రాష్ట్రమే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. న్యాయం ప్రకారం రాయలసీమ తన పాత హోదాను అడిగి తీసుకోవాలి. కనీసం హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయడం సముచితమన్న ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతి పాదన తీసుకొచ్చారు. దీన్ని మూడు ముక్కల ఆటంటూ టీడీపీకి ఉన్న ప్రచార బలంతో, మీడియా దన్నుతో అవహేళన చేసి, ప్రజలను ఏమార్చారు.
ఇప్పుడు అమరావతి నిర్మాణం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదనే గ్రహింపు కూడా చంద్రబాబుకు ఉన్నది. కొన్ని దశాబ్దాలు గడిచినా అది గ్రోత్ ఇంజన్ మాదిరిగా ఉపయోగపడే అవకా శాలు తక్కువే. అయినా ఇతరేతర కారణాలేవో ఆయన్ను అమరావతి చుట్టే తిప్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రగతి కోసం తక్కువ కాలంలో గ్రోత్ ఇంజన్‌గా అందుబాటులోకి వచ్చే మరో ప్రత్యామ్నాయ సూచన కూడా జగన్ చేశారు. మచిలీ పట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని గ్రోత్ కారిడార్‌గా ప్రకటించ వచ్చని సూచించారు. ఇందుకోసం ఆయన ఉపయోగించిన ‘మావిగన్’ పేరు నచ్చకపోతే ఇంకే పేరైనా పెట్టుకోవచ్చని కూడా అన్నారు.
తక్షణమే యాభై లక్షల జనాభా గల నగరంగా ఇది అవతరిస్తుంది. మచిలీపట్నం పోర్టు, దేశంలో ప్రముఖమైన విజయవాడ రైల్వే జంక్షన్, గన్నవరం అంతర్జాతీయ విమానా శ్రయం రెడీమేడ్‌గా అందుబాటులోకి వస్తాయి. అమరావతికి రెండో విడత భూ సమీకరణ అవసరముండదు. తొలి విడత సమీకరించిన భూమిలోనే కేటాయింపులు పోగా మిగిలిన భూమి అమ్మకాలతోనే ఈ కారిడార్‌లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయవచ్చు. మచిలీపట్నం రాష్ట్రంలోని తొలి మునిసిపా లిటీల్లో ఒకటి.
నిజాంల కాలంలోనే హైదరాబాద్ నుంచి బందరు రేవుకు రహదారి నిర్మాణం (ప్రస్తుత ఎన్‌హెచ్ 65) జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే ఏకైక రేవుపట్టణం కూడా మచిలీపట్నమే! ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు పెద్దఎత్తున ప్రారంభించడానికి తక్షణం ఉపయోగ పడే ప్రాంతం. రాష్ట్ర పురోగతికి ఆచరణాత్మకమైన మార్గాన్ని అనుసరించాలనుకుంటే ఈ ప్రతిపాదనను పరిశీలించవచ్చు. అసాధ్యమైన అమరావతి బాటనే ఎంచుకుంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


