‘విజనరీ’ కాదు.. విఫల పాలకుడు! | Chandrababu Govt Failed in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘విజనరీ’ కాదు.. విఫల పాలకుడు!

Apr 30 2026 5:14 AM | Updated on Apr 30 2026 5:14 AM

Chandrababu Govt Failed in Andhra Pradesh

రిటైల్‌ బంకులలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చట్ట విరుద్ధంగా ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: ‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు...! అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి! విజనరీ, పరిపా­లనా దక్షుడని టీడీపీ కూటమి, ఎల్లో మీడియా ఊదరగొట్టే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రిటైల్‌ బంకులలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్‌ను రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చంద్రబాబు సర్కారు అడ్డదారి­లో ఉత్తర్వులు జారీ చేయడంతో వారం రోజులు వాహనదారులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంపై రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్‌లో అవసరమైతే కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కొనుగోలు చేయాలి. అందుకోసం ఇప్పటికే  ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. బల్క్‌లో కొంటే లీటర్‌ డీజిల్‌కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్‌ బంకుల్లో రిటైల్‌గా అయితే లీటర్‌ డీజిల్‌ రూ.98కే దొరుకుతుండటంతో అడ్డదారిలో కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో బాబు సర్కారు బండారం బట్టబయలైంది. 

పాలన గాలికి వదిలేసి మొద్దునిద్ర..!
పెట్రోల్, డీజిల్‌ కొరతతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు అల్లాడుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్‌ కొరత వేధిస్తుండటం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. రాష్ట్రంలోని 4,500 బంకుల్లో ఇంధన కొరత వేధిస్తోంది. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి బారులు తీరుతున్నా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనమే లేకుండాపోయింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం పెట్రోల్, డీజిల్‌ కొరతను తీర్చలేక చేతులు ఎత్తే­శారు. అత్యవసర సేవలు, సరఫరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం మరో­సారి బట్టబయలైంది. కీలక సమస్యపై ముఖ్య­మంత్రి చంద్రబాబు నాలుగు రోజులపాటు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఈనెల 24 నుంచి పెట్రోల్, డీజిల్‌ కొరత తలెత్తింది. 

బంకుల వద్ద వాహనదారులు క్యూలైన్లలో పడిగాపు­లు కాస్తున్నా ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్ర వీడలేదు. పెట్రోల్, డీజిల్‌ కొరత తలెత్తినట్లు అదే రోజు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవా­ల్సిన విషయం కావడంతో అధికారులు నిస్స­హాయంగా మిగిలారు. దాంతో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చి బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా లారీలు, ఇతర వాహనాల సర్వీ­సులు నిలిచిపోయాయి. అయినా సరే ముఖ్య­మంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోకపోవ­డంతో పరిస్థితి పూర్తిగా దిగజారింది. బంకుల వద్ద ఘర్షణలు చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వాహనదారులు ఆందోళ­నతో ఒక బంకు నుంచి మరో బంకు చొప్పున నాలుగైదు చోట్లకు తిరిగినా అంతటా అదే పరిస్థితి నెలకొంది. వాహనాల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనం ఖర్చు కావడం మినహా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది.  

చమురు కంపెనీలపై ఆగ్రహం అంటూ లీకులు..
ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. పెట్రోల్, డీజిల్‌ లేకపోవడంతో వాహనదారులు గగ్గోలు పెట్టా­రు. ఎట్టకేలకు గత ఆదివారం సాయంత్రానికి­గానీ చంద్రబాబు కుంభకర్ణ నిద్ర వీడలేదు. అధి­కారు­లతో సమీక్ష పేరిట మభ్యపుచ్చేందుకు యత్నించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై సీరియస్‌ అయినట్లు ఎల్లో మీడి­యాకు లీకులిచ్చారు. ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పా­టు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకవైపు వా­ణిజ్య అవసరాల కోసం వినియోగించాల్సిన డీజి­ల్‌ను సిండికేట్‌ కాంట్రాక్టు సంస్థల కోసం దారి మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్ర­బాబు మరోవైపు చమురు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకులిచ్చారు. కొరత ఎందుకు ఏర్పడిందో తనకు స్పష్టంగా తెలిసినా పరి­ష్కారం కోసం చర్యలు తీసుకోకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగ­స్వామిగా కొనసాగుతున్నా కనీసం పెట్రోలియం శాఖ మంత్రితో చర్చించకపోవడం గమనార్హం. 

తుస్సుమన్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌..
చంద్రబాబు ఘనంగా చెప్పుకునే రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ గాలి బుడగలా పేలిపోయింది. పెట్రో­ల్, డీజిల్‌ కొరత లాంటి సాధారణ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. వెలగపూడి­లోని ఆర్‌టీజీఎస్‌ ఆఫీసు నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చిటికెలో పరిష్కరిస్తామని చంద్రబాబు గొప్ప­గా చెబుతూ ఉంటారు. వారం రోజులుగా బంకుల వద్ద బారులు తీరిన వాహ­నదారుల ఫొటో­లు, వీడియోలను ఆర్‌టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ చూపించలేదా? లేక సమ­స్యను పరిష్కరించడం కూటమి ప్రభుత్వానికి చేతకాలేదా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పలు ప్రాంతాల్లో తనిఖీల పేరిట బంకు యజమాను­లను వేధిస్తున్నారు. స్టాక్‌ లేదనే వంకతో బంకులను సీజ్‌ చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.

చినబాబు మౌనం.. పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసం
పెట్రోల్, డీజిల్‌ కొరత ఇంత తీవ్రంగా వేధిస్తు­న్నా మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌  కనీసం స్పందించలేదు. తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాలో హడావుడి చేసే వారిద్దరూ పెదవి విప్పడం లేదు. గుప్త పర్యటన కోసం వెళ్లిన లోకేశ్‌ సామాన్యుల సమస్యతో తనకేం సంబంధం అన్నట్లుగా మిన్నకుండిపోయారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతం వీడలేదు. కనీసం ఫోన్‌లో కూడా అధికారులను ఆరా తీయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement