ఆరోగ్యశ్రీకి దిన‘ధన’గండం! | Aarogyasri: OP, Emergency Medical Services Suspended for Fifth Day in AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కల్ల‘బిల్లు’ కబుర్లు.. ఆరోగ్యశ్రీకి దిన‘ధన’గండం!

Apr 6 2026 4:43 AM | Updated on Apr 6 2026 4:43 AM

Aarogyasri: OP, Emergency Medical Services Suspended for Fifth Day in AP

శ్రీకాకుళంలోని ఎ–1 ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ/ ఎనీ్టఆర్‌ వైద్యసేవలను పూర్తిగా నిలిపివేసి కియోస్క్‌ ఖాళీ చేసిన దృశ్యం, ఆరోగ్యశ్రీ నిలిపివేయడంతో అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో ఓపీ సేవల వద్ద బారులు తీరిన రోగులు

‘ఆశా’నిరాశల మధ్య పేద రోగుల ఆందోళన 

ఐదో రోజూ స్తంభించిన ఓపీ, అత్యవసర వైద్యసేవలు  

వెనక్కి తగ్గని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు  

హామీలు తప్ప డబ్బులు చెల్లించని సర్కారు  

ఆరునెలల్లో రెండోసారి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ సమ్మె 

ఇప్పటికే చర్చలు విఫలం.. నేడు మరోమారు సర్కారుతో సంప్రదింపులు 

అప్పోసప్పో చేసి వైద్యం చేయించుకుంటున్న రోగులు  

ఆర్థికంగా చితికిపోతున్న రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు

పక్షవాతం బాధితుడికి వైద్యానికి నిరాకరణ 
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని చింతాయగారిపాలెం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సుబ్బయ్య ఆదివారం తెల్లవారుజామున బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. ఆయనను  వెంటనే ఒంగోలులోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం చికిత్సకు నిరాకరించింది. డబ్బు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని తెగేసి చెప్పింది. చేసేది లేక కుటుంబ సభ్యులు రూ.పదివేలు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా రూ.85వేలు అప్పుచేసి చెల్లించారు. ఐసీయూలో ఉంచి వైద్య సేవలందించడానికి రోజుకు రూ.30 వేలు ఖర్చవుతుందని చెబుతున్నారని సుబ్బయ్య భార్య కోటేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు.

గత ప్రభుత్వంలో పేదింటి రోగులపాలిట ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ నేడు చంద్రబాబు పాలనలో అంపశయ్యపైకి చేరింది. అనారోగ్యం పాలై.. చేతిలో చిల్లిగవ్వ లేక ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే ధైర్యంతో ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్య తరగతి రోగులకు సేవలు ఆపేశామనే మాటలు శరాఘాతాల్లా తగులుతున్నాయి. ఫలితంగా వారు దినదినగండంగా బతుకులీడుస్తున్నారు. రేపోమాపో సేవలు అందుబాటులోకి వస్తాయేమోననే ఆశతో నిరీక్షిస్తున్నారు. చంద్రబాబు సర్కారులో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఆస్పత్రులకు రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. చర్చలంటూ కల్లబొల్లి కబుర్లతో కాలం వెళ్లదీస్తోంది. ఇప్పటికే చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్యాలూ వెనక్కి తగ్గడం లేదు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న రోగులు తమకు భారమైనా అప్పోసప్పో చేసి డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకుంటున్నారు. సర్కారు కాఠిన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ఐదో రోజు ఆదివారం కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పెట్టడంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా) సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. వీరి సమ్మె నేపథ్యంలో రోజువారీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు వచ్చే చికిత్సల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఫలితంగా చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళ్లే పేదలకు నిరాశే ఎదురవుతోంది. ఉచిత చికిత్సలు అందించబోమని, చేతి నుంచి డబ్బు కట్టాల్సిందేనని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో చేతి నుంచి డబ్బు చెల్లించి పేద, మధ్యతరగతి కుటుంబాల వారు వైద్యం చేయించుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె చేశాయి. డిసెంబర్‌ కంతా బకాయిలన్నీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన గడువు ముగిసి, నెలలు గడుస్తున్నా బకాయిల సంగతి తేల్చకపోవడంతో ఆరు నెలల్లో మరోమారు ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. బాబు గద్దెనెక్కాక పదే పదే నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్తుండటంతో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. 

జిల్లాల్లో అల్లాడుతున్న రోగులు...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికభాగం స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేశారు. వచ్చిన రోగులను వైద్యం చేయబోమని చెప్పి తిప్పి పంపుతున్నారు. నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని తెగేసి చెబుతున్నారు.
⇒ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా రూ.వందకోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 

⇒ అనంతపురం జిల్లాలో ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సేవలు నిలిపివేశాయి. దీంతో రోగులు అల్లాడుతున్నారు. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని రోగులు అనంతపురం పెద్దాసుపత్రికి  పోటెత్తుతున్నారు. పెద్దాసుపత్రిలో సౌకర్యాలు మృగ్యంగా మారాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి దుస్థితిపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలో 22 నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేశారు. వచ్చిన రోగులను తిప్పి పంపించేస్తున్నారు. కొందరు రోగులు విధిలేక డబ్బులు చెల్లించి సేవలు పొందుతున్నారు. అత్యవసర చికిత్సలకు అప్పులు చేసి చితికిపోతున్నారు. జిల్లాలో మొత్తం దాదాపు రూ.130 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌ ఉన్నట్టు ఆశా ప్రతినిధులు చెబుతున్నారు.  

⇒ నంద్యాల జిల్లాలో ఏప్రిల్‌ 1 నుంచి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపుగా రూ. వంద కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌ ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాలో ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) పథకం సేవలనూ ఏడాదిగా నిలిపివేశారు. దీంతో పేద రోగులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.  

⇒ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఓపీ సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు సైతం నిలిపివేసే యోచనలో ఆస్పత్రులు ఉన్నాయి. 


బిల్లులు క్లియర్‌ అయితేనే డిశ్చార్జ్‌
⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్‌ అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా సేవలు నిలిపివేయడం ఇది మూడోసారి. జిల్లాలో ఆస్పత్రులకు రూ.110 కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఒక్క రోగికీ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించలేదు. ఇదివరకే శస్త్రచికిత్స చేసిన రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా మందుల్వివడం లేదు. దీంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యవిుత్రలనూ విధుల్లో ఉంచడం లేదు. దీంతో సమాధానం చెప్పేవారు లేక రోగులు అల్లాడుతున్నారు. మరికొన్ని ఆస్పత్రుల్లో ఇదివరకే శస్త్రచికిత్సలు జరిగి కోలుకున్న రోగులను డిశ్చార్జి చేయడం లేదు. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ అయ్యాకే డిశ్చార్జి చేస్తామని  చెబుతున్నట్టు సమాచారం.  

నేడు మరోమారు చర్చించే అవకాశం
ఇప్పటికే ఒకమారు ప్రభుత్వంతో ఆశా చర్చలు విఫలం అయ్యాయి. ఇదిలా ఉండగా సోమవారం మరోమారు ఆశా ప్రతినిధులతో వైద్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో జరిగిన చర్చల్లో మొత్తం బకాయిల్లో రూ. వెయ్యి కోట్ల మేర రెండు వారాల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రూ. వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసి, మిగిలిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇస్తేనే సమ్మె విరమిస్తామని ఆశా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖతో చర్చించిన అనంతరం నిధుల విడుదలపై రోడ్‌మ్యాప్‌ ఇస్తామని సౌరభ్‌ సూచించినట్టు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement