తెలంగాణలో తరిమికొట్టినా తీరు మార్చుకోని బాబు

Buggana Rajender Slams Chandrababu Naidu - Sakshi

పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

కర్నూలు  , ప్యాపిలి: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్కడి ప్రజలు ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టారని.. అయినా బాబు తన తీరు మార్చుకోకపోవడం బాధాకరమని పీఏసీ ఛైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని పీఆర్‌ పల్లి, వెంకటకొండాపురం, పెద్దపాయి గ్రామాల్లో శుక్రవారం రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బాబు పతనం ప్రారంభమైందని చెప్పేందుకు తెలంగాణ ఫలితాలే నిదర్శనమన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందినకాడికి దోచుకున్నారని, చివరకు మరుగుదొడ్ల బిల్లుల విషయంలోనూ కక్కుర్తికి పాల్పడ్డారని విమర్శించారు.

ఇప్పటికైనా  చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపీలో కూడా పునరావృతం అవుతాయన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులు.. గ్రామాల్లో ప్రజలను బెదిరించేందుకు కూడా తెగబడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే నవరత్నాల పథకాలు అమలవుతాయని, ప్రతి ఇంటికీ లక్షల రూపాయల్లో లబ్ధి చేకూరుతుందన్నారు.  కార్యక్రమంలో ప్యాపిలి, డోన్‌ జెడ్పీటీసీ సభ్యులు దిలీప్‌చక్రవర్తి, శ్రీరాములు, పీఆర్‌ పల్లి నాయకులు నరసింహారెడ్డి, చిన్న రంగన్న, ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరావు, వెంకటేశ్, కంబయ్య, రంగనాథ్‌రెడ్డి, పుల్లారెడ్డి, రంగనాథ్, పెద్దబాలిరెడ్డి, చిన్నరంగన్న, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సంక్షోభంలో వ్యవసాయం..
డోన్‌: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. తన స్వగృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులపాలై అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కరువు నుంచి రైతులను గట్టెక్కించేందుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top