న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ పరిశోధనల్లో భారత్‌కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్,ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్) ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భూమిపై మానవ జీవితానికి అంతరిక్షం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తిని ప్రేరేపిస్తోందని, నేడు అది వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, సమాజాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని తెలిపారు.
అంతరిక్ష కక్ష్యలు రద్దీగా మారుతున్న తరుణంలో.. ఘర్షణల కంటే సహకారానికి, స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరతకు, మినహాయింపుల కంటే సమ్మిళిత విధానానికి మన ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్‌లు అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని తెలిపారు.
రైతులు, మత్స్యకారులకు సహాయం చేయడం నుంచి వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ వరకు ఇస్రో సాంకేతికతలు కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, సహకారంతో సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగాన్ని రూపొందించడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.


