కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పోస్టల్ బ్యాలెట్‌లో తేలిపోయింది. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, డీఏలు, పీఆర్‌సీ వంటివి అందించకపోవడం, వారి సమస్యలను పరిష్కరించకపోవడంతో వారంతా ఓటింగ్‌కు దూరంగా ఉండి ప్రభుత్వంపై తమకున్న వ్యతిరేకతను చాటిచెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. సుమారు 2వేల మంది ఎన్నికల విధుల్లో ఉంటే అందులో కేవలం 400 పై చిలుకు మంది మాత్రమే ఓటు వినియోగించుకోవడం విశేషం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధుల్లో ఉన్న అఽధికారులు, సిబ్బంది తమ ఓటు వినియోగించుకునేందుకు కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్(మెయిన్)లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 5 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తమ ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను చూపి ఓటు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఉదయం నుంచి మందకొడిగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సాయంత్రాని కాస్త ఊపందుకుంది. మొత్తం మీద సుమారు 2వేలకుపైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే సాయంత్రానికి అందులో 20 శాతం అంటే 435 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి, టీడీపీ అభ్యర్థి మట్లి సువర్ణ, ఆమె భర్త మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. కడప డీఎస్పీ భవానీ పోలీస్ బందోబస్తును, ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. వైఎస్సార్‌సీపీ తరపున జనరల్ ఏజెంట్ గా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి టి. జయచంద్రారెడ్డి. బూత్ లెవెల్ ఏజెంట్లుగా మునిశేఖర్‌రెడ్డి, కంచుపాటి బాబు, మాజీ కార్పొరేటర్ ఆర్.చెన్నయ్య కూర్చున్నారు.


