ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిధి వీవీరెడ్డి కాలనీలోని ఫౌంటేన్ వద్ద ఉన్న స్టోర్‌లో చోరీ జరిగింది. స్టోర్‌లో ఉన్న సుమారు రూ.20 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని స్టోర్ సెక్రటరీ నూర్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీని పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తలుపు తాళం పగలగొట్టి స్టార్ లోనికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
కడప అర్బన్ : కడప కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ సందర్భంగా ఈ నెల 17వ తేదీన గాంధీనగర్ స్కూలు వద్ద రాళ్ల దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. అదే రోజు రాత్రి రెండు కార్లను దగ్ధం చేశారు. హత్యాయత్నం, కార్లను కాల్చిన కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్టు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సాయి, పుల్లయ్య, రమణ, ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
గుర్రంకొండ : కారును ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన గుర్రంకొండలో జరిగింది. పొలీసుల కథనం మేరకు.. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన సంజనమ్మ(68) కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. ఈమెకు చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు సమీపంలో ఉన్న విరూపాక్షపురంలో ఆయుర్వేద వైద్య చికిత్సల కోసం తీసుకెళ్లాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సంజనమ్మతోపాటు ఆమె కుమార్తె అరుణమ్మ(53, కుమారుడు మునేంద్ర(28) కలిసి కారులో పలమనేరుకు బయలుదేరారు. కారు అర్ధరాత్రి గుర్రంకొండ సమీపంలోని చిట్టిబోయపల్లె వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న రాజంపేట–బెంగుళూరు ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సంజనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కారులో మిగిలిన అరుణమ్మ, మునేంద్ర, డ్రైవర్ ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ అరుణమ్మ పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు కడప రిమ్స్ 108 వాహనంలో తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు తెలిపారు. వైద్యకోసం వెళుతూ ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


