ఎన్నికల నిబంధనలకు పాతర | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలకు పాతర

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

కడప నగరపాలక సంస్థలో ఎన్నికల నిబంధనలు గాలికి ఎగిరిపోయాయి. అధికార టీడీపీ నేతలు చెప్పిందే వేదంగా ప్రత్యేకాధికారి మొదలుకొని కమిషనర్లు పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వార్డుల పునర్విభజన మొదలుకొని మున్సిపల్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాల వరకూ ప్రతిదీ దాచిపెట్టి... మూసిపెట్టి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు పై అధికారులంతా కూడబలుక్కొని పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌లో 50 వార్డులను 66 వార్డులకు పెంచాలని పునర్విభజన చేపట్టారు. ఇందులో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గణన చేపట్టారు. ఇందులోనూ ఓసీలను బీసీలుగా, బీసీలను ఓసీలుగా, ఎస్సీలను బీసీలుగా ఇష్టం వచ్చినట్లు గుర్తించినట్లు రాజకీయ పార్టీల నేతలు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. వీటి ఆధారంగానే వార్డుల రిజర్వేషన్‌ ఇష్టారీతిన చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికల తంతు మొదలైంది. ఇందులో కూడా అధికారులు అత్యంత రహస్యంగా వ్యవహరించారు. ఏ డివిజన్లకు ఎంత మంది నామినేషన్లు వేశారు, వారు ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారు అనే వివరాలను కూడా ప్రకటించాలి, ఆ తర్వాత జరిగే స్క్రూట్నీలో ఎంత మంది నామినేషన్లను తిరస్కరించారు, ఎవరెవరు ఏకగ్రీవం అయ్యారు. ఎంత మంది పోటీలో ఉన్నారు... పోటీలో ఉన్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఏమిటి, బ్యాలెట్‌లో ఎన్నో నంబర్‌లో వారి పేరు, గుర్తు ఉంది అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉంది. కానీ ఏ దశలోనూ నగరపాలక అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదు. కమిషనర్‌ పేరు చెప్పి ఆయన కింద పని చేస్తున్న ఏసీ, డీసీ, విభాగాధిపతులు ఏ సమాచారాన్ని ప్రజలకు చేరవేయలేదనే తెలుస్తోంది.

సమాచార హక్కుకు తూట్లు

సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు. ఇక ఎన్నికల్లో అయితే తాను ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఎప్పటికప్పుడు వాస్తవమైన సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా పౌరులకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కడప నగర పాలక సంస్థలో సమాచారం అంతా గోప్యతకు గురైంది. అధికార పార్టీ నేతలు, అధికారుల చేతిలో బందీగా మారింది. వార్డుల పునర్విభజన, ఓటర్ల ప్రకటన, కుల గణన ఇలా ప్రతి దానిని అధికారులు నోటీసు బోర్డుల్లో ఉంచి ప్రసార మాధ్యమాలకు తెలియజేయడం ద్వారా ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించాలి. కానీ కడప కార్పొరేషన్‌లో ప్రత్యేకాధికారి, కమిషనర్‌ ఆ హక్కును కాలరాశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వారి పేరు చెప్పి నగరపాలక యంత్రాంగం ప్రతి సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచింది.

అధికారుల నిర్వాకానికి బలైన ఉద్యోగి

నగరపాలక అధికారి, ఇతర అధికారుల నిర్వాకానికి అభం శుభం తెలియని ఓ ఉద్యోగి సస్పెండ్‌ అయినట్లు తెలిసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఆ ఉద్యోగి ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సైన్డ్‌ కాపీలను సమాచార శాఖకు పంపి, తద్వారా ప్రసార మాధ్యమాలకు చేరవేయాలి. ఈ పని సక్రమంగా చేసినందునే ఆ ఉద్యోగిని సస్పెండ్‌ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట సైన్డ్‌ కాపీలను ప్రసార మాధ్యమాలకు ఇవ్వలేదని మండిపడిన ఉన్నతాధికారులు... ఆ సైన్డ్‌ కాపీలను పత్రికలు, మీడియాకు ఇచ్చినందుకే అతన్ని సస్పెండ్‌ చేశారు. అంటే ఈ ఎన్నికల మాటున ఎంత గూడుపుఠానీ నడుస్తుందో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు.

వార్డుల పునర్విభజన మొదలుకొని ఏకగ్రీవాల వరకూ అంతా రహస్యమే

మూసిపెట్టి... దాచిపెట్టి టీడీపీకి లబ్ధి చేకూర్చే కుట్ర

ప్రత్యేకాధికారి మొదలుకొని

కమిషనర్లు, యంత్రాంగమంతా కుమ్మక్కు

పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు కూడా ప్రకటించని అధికారులు

వెల్లువెత్తుతున్న విమర్శలు

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారముంది కదా అని టీడీపీ నాయకులు.. రౌడీలు, గూండాలను పెట్టి నామినేషన్లను అడ్డుకొని, వేయడానికి వస్తున్న వారిపై దాడులు చేసి నామినేషన్‌ పత్రాలను చించివేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు టీడీపీ నేతలు ఎలా చెబితే అలా నడుచుకున్నారు. వాళ్లు కూర్చొమంటే కూర్చున్నారు, వారు నిల్చోమంటే నిల్చున్నారు. మొత్తానికి ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలకు పాతరేసి గోతిలో పాతిపెట్టారు.

గురువారం కడప నగరపాలక మున్సిపల్‌ హైస్కూల్‌(మెయిన్‌)లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఎన్నికల బరిలో ఉన్న ఓ అభ్యర్థికి తన గుర్తు ఏమిటో, తన పేరు బ్యాలెట్‌లో ఎన్నో నంబరో తెలియకపోవడాన్ని బట్టి ఈ ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరుగుతున్నాయో ఇట్టే తెలిసిపోతుంది.

– కడప కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement