కడప అర్బన్ : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ టి. భవాని హెచ్చరించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఉంటుందని తెలిపారు. మంగళవారం కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కడప సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ మూడు రోజులపాటు కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. సీకే దిన్నె, చెన్నూరు, వల్లూరు, జి.ఆర్.పల్లి, పెండ్లిమర్రి, కమలాపురం మండలాల నామినేషన్లను ఇక్కడ స్వీకరిస్తారని పేర్కొన్నారు. మిగిలిన మండలాల్లో ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండరాదన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించినా, అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
దీప్తి రెడ్డి ఇంటిపై దాడిపై విచారణ
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఘటనా స్థలంలో కిటికీ అద్దాల ముక్కలు గుర్తించామని, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కడప డీఎస్పీ భవాని హెచ్చరిక


