వేముల : వేల్పుల గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు (52) అనే వ్యక్తి మృతి చెందాడు. వేములలో నివాసముంటున్న నరసింహులు పనిమీద పులివెందులకు మోటార్ బైకుపై బయలుదేరాడు వేల్పుల వద్దకు వెళ్లగానే జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసింహులు కుటుంబాన్ని జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి ఆసుపత్రిలో పరామర్శించి ఓదార్చారు.
రోడ్డు దాటుతుండగా..
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు–ప్రొద్దుటూరు బైపాస్‌లోని రైల్వే స్టేషన్ వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గురువారం అర్ధరాత్రి బలరాం (45) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పట్టణ సీఐ నరేష్‌బాబు తెలిపిన వివరాలిలా... ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురంకు చెందిన బలరాం గత కొంత కాలంగా దాల్మియా కర్మాగారంలో కూలి పనులు చేసుకొనేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి స్వగ్రామానికి వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
సంప్రదాయానికి సాంకేతికతను జోడించాలి
కడప ఎడ్యుకేషన్: సంప్రదాయ పద్ధతులు, ప్రాచీన వైద్య విధానాలకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తేనే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమని ఏపీ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు (ఏపీఎంఏపీ) సీఈఓ ఆవుల చంద్రశేఖర్ అన్నారు. వైవీయూ తాళ్లపాక అన్నమాచార్య సెనేట్ హాల్లో బోటనీ విభాగం ఆధ్వర్యంలో, పీఎం–ఉషా సౌజన్యంతో మూలికా వైద్యంపై శుక్రవారం ఒక రోజు జాతీయ కార్యశాల ఘనంగా జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న సీఈఓ చంద్రశేఖర్ ‘ప్రస్తుత ధోరణులు, పరిశోధన ఆవిష్కరణలు, భవిష్యత్ అవకాశాలు’ అనే అంశంపై మాట్లాడారు. బోర్డు పనితీరును పీపీటీ, వీడియోల ద్వారా ప్రదర్శిస్తూ.. తాను పరిశోధించిన గ్రంథాలలోని 452 రకాల మొక్కలు, 225 రకాల ఔషధ పంటల సాగు విధానాలను క్షుణ్ణంగా వివరించారు. సదస్సులో వైవీయూ రెక్టార్ ప్రొఫెసర్ ఎ.జి.దాము, రిజిస్ట్రార్ ఎన్.సి.గంగిరెడ్డి, ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ సందేశాలిచ్చారు. బెంగళూరు ఐఎన్‌ఎస్‌ఏ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్.ఆర్.రావు, ఎం.సంజప్ప, కర్నూలు ఉర్దూ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ పి.ఎస్.షావల్లి ఖాన్ రిసోర్స్ పర్సన్స్‌గా వివరణ ఇచ్చారు. సదస్సుకు సమన్వయకర్తగా ఎ.మధుసూదన రెడ్డి, నిర్వాహక కార్యదర్శులుగా టి.చంద్రశేఖర్, పులి చంద్రఓబుల్ రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో సబ్ డీఎఫ్‌ఓ స్వామి వివేకానంద, సాంకేతిక సహాయకుడు ప్రసాద్, కమిటీ సభ్యులు ఎస్.రాజగోపాల్ రెడ్డి, ఎన్.మీరావలి, సి.నాగేంద్ర, బి.క్రాంతి, ఎస్.హిమబిందు, డి.వి.సురేష్ బాబు, వి.విష్ణుబాబు, తదితరులు పాల్గొన్నారు.


