వంచక ప్రభుత్వానికి పతనం తప్పదు | - | Sakshi
Sakshi News home page

వంచక ప్రభుత్వానికి పతనం తప్పదు

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

అనంతపురం సిటీ: హామీలు నెరవేర్చకుండా మోసం చేయాలని చూస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురం వేదికగా సాగిన రాయలసీమ జోనల్‌ (జోన్‌–4) వైద్య ఉద్యోగుల గర్జన మహాసభ విజయవంతమైంది. ముందుగా సప్తగిరి సర్కిల్‌ నుంచి రుద్రంపేట బైపాస్‌ వరకు వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. రాయలసీమ జిల్లాల నుంచి తరలివచ్చిన కాంట్రాక్ట్‌ నర్సులు, పారామెడికల్‌, ఫార్మసీ, ల్యాబ్‌ అసిస్టెంట్‌ సిబ్బంది వందలాది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. అనంతరం రుద్రంపేట బైపాస్‌లోని యాదవ భవన్‌లో జరిగిన మహాసభలో జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కోటేశ్వరరావు డిమాండ్ల సాధన కోసం గతంలో 15 రోజుల పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే ఓ మెట్టు దిగివచ్చిన ఉన్నతాధికారులు.. చర్చల పేరుతో ఆర్థికేతర అంశాలు పరిష్కరిస్తామని, మిగిలిన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆర్థికపరమైన డిమాండ్లపై ఇప్పటి వరకూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కానీ, అధికారులు కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. మిగిలిన వారితో సమానంగా బేసిక్‌ వేతనం చెల్లించాలని, వంద శాతం గ్రాస్‌ సాలరీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీ గవర్నమెంట్‌ కాంట్రాక్టు నర్సెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ 100 శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్ట్‌ ఉద్యోగి కుటుంబానికీ రూ. 50 లక్షల ఎక్స్‌ గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్‌ ఉద్యోగం కల్పించాలన్నారు. ఈపీఎఫ్‌, పరస్పర బదిలీల వంటి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అక్టోబర్‌ 3వ తేదీలోపు రెగ్యులరైజేషన్‌పై స్పష్టమైన జీఓ ఇవ్వకపోతే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎల్‌టీ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు మాధవ్‌, ఏపీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శరత్‌, జేఏసీ కో చైర్మన్‌ వెంకట్‌, ఏపీజీసీఎన్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు సుమన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వినోద్‌, ప్రశాంతి, లావణ్య, సుజేంద్ర, చాందిని, వెంకటేష్‌ నాయక్‌, శ్రీకాంత్‌, వలి, మహేష్‌, కాంట్రాక్ట్‌ నర్సులు, ఎక్స్‌ రే, ఓటీ, ఈసీజీ టెక్నిషీయన్లు పాల్గొన్నారు.

మాట తప్పితే అక్టోబర్‌ 3 తర్వాత

నిరవధిక సమ్మె

వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్‌

ఉద్యోగుల అల్టిమేటం

అనంతపురం వేదికగా రాయలసీమ జోనల్‌–4 ‘గర్జన’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement