కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఏడాది కాలంగా కొత్త విద్యుత్ మీటర్ల కొరత వినియోగదారులను తీవ్రంగా వేధిస్తోంది. విద్యుత్ సేవల్లో తామే ముందున్నామని చెప్పుకునే సంస్థ నిస్సహాయ స్థితికి ఈ కొరతే అద్దం పడుతోంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మీటర్లు అందుబాటులో లేక ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కనెక్షన్ మంజూరైనా మీటర్ బిగించకపోవడంతో గృహ ప్రవేశాలు చేసిన వారు విద్యుత్ కోసం ఇరుగుపొరుగు ఇళ్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరోవైపు హైఓల్టేజ్, షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో మీటర్లు కాలిపోయినా, పాడైపోయినా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. స్టాక్ లేదన్న కారణంతో సిబ్బంది జాప్యం చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చలానా మాత్రం కొత్త దానికంటే ఎక్కువే!
కొత్త మీటర్లు అందుబాటులో లేకపోవడంతో ఏళ్ల క్రితం వినియోగించి పక్కనపెట్టిన పాత మీటర్లనే మరమ్మతులు చేసి ప్రస్తుతం బిగిస్తున్నారు. అయితే మీటర్ ఫీజు విషయంలో మాత్రం వినియోగదారులకు ఎలాంటి మినహాయింపు ఉండటం లేదు. పైగా కొత్త మీటరుకు ఎంత చెల్లించాలో, అంతకంటే ఎక్కువ మొత్తాన్ని చలానా రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. సాధారణంగా గతంలో ఒక కిలోవాట్‌కు రూ.2,100, రెండు కిలోవాట్లు అయితే రూ.4,200 తీసుకొని కొత్త మీటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక కిలోవాట్‌కు మీటర్ తీసుకుంటేనే ఏకంగా రూ.4,200 వసూలు చేస్తున్నారు. కేటగిరి–2 కింద కనెక్షన్ పొందితే రూ.5 వేలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. పోనీ ఇంత డబ్బు తీసుకొని కొత్త మీటర్ ఇస్తున్నారా అంటే అదీ లేదు.. పాత మీటర్, పాత బాక్స్ ఇవ్వడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ పాత మీటర్ల పనితీరు, కచ్చితత్వంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీటర్ రీడింగ్లో లోపాలు తలెత్తితే విద్యుత్ బిల్లులు తారుమారై తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీటర్ బాక్సుల కొరత
కొత్త మీటర్ల కోసం ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి ఇండెంట్ పెట్టినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే పైస్థాయి నుండి స్టాక్ అసలు సరఫరా కాలేదని స్థానిక సిబ్బంది పేర్కొంటున్నారు. కొత్త మీటర్లు వచ్చే వరకు పాత వాటితోనే నెట్టుకురావాల్సి ఉంటుందని అనధికారికంగా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పాత మీటర్‌లో రీడింగ్‌ను ‘0’ (సున్నా) చేసి కొత్తగా ఇస్తున్నారే తప్ప, వాటికి కనీసం కొత్త బాక్సులు కూడా ఇవ్వడం లేదు. సున్నం, సిమెంటు మరకలు పడి మురికిగా మారిన, ఎప్పుడో వాడేసి పాతవైపోయిన బాక్సులను వినియోగదారులకు అంటగడుతున్నారు. దీని వెనుక స్మార్ట్ మీటర్లను బలవంతంగా రుద్దేందుకు ఏమైనా తెరవెనుక ఒత్తిళ్లు సాగుతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ కొత్త మీటర్ల కొరతను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు కాలిపోయిన, పాడైన మీటర్లను మార్చుకోవాల్సిన వినియోగదారుల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.
రీడింగ్‌ల తారుమారుపై
వినియోగదారుల గుండెల్లో రైళ్లు!
కొత్త మీటర్ల కొరత పేరుతో
ఏపీఎస్‌పీడీసీఎల్‌స్మార్ట్’ ప్లాన్?
ఫీజుల్లో మాత్రం మినహాయింపు లేదు.. కొత్త వాటి కంటే రెట్టింపు వసూళ్లు
వినియోగదారుల తీవ్ర అవస్థలు


