కడప ఎడ్యుకేషన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట రహదారి సూచికలు, హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు వంటి భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ముఖ్యంగా యువతలో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం పెంచాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలను వివరించారు.
మాదకద్రవ్యాల రవాణాను అరికడదాం
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, అక్రమ రవాణా నివారణ, కేసుల నమోదు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.


