జిల్లాలో 104 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని వ్యవసాయ సమీక్ష సమయంలో వ్యవసాయశాఖ డీడీ నివేదికలు చదివారు. దీనికి వెంటనే స్పందించిన జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు అచ్చుకట్ల కరీముల్లా, వీఎన్‌పల్లి ఎంపీపీ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో తీవ్రవర్షాభావంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే మీరు కేవలం 39 మండలాల్లో 104 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అధికారులు చెప్పే పంటనష్టం లెక్కలన్నీ ఒక్క మండలంలో ఉంటుందన్నారు. దీన్ని బట్టి మీ సర్వే ఎంత పేలవంగా జరిగిందో తెలుస్తుందని అధికారుల తీరును దుయ్యబట్టారు. వీఎన్‌పల్లె మండలంలో అమ్మగారిపల్లె, కొమ్మెద్ది, మర్రిపల్లెలో పత్తి, వేరుశనగ, నిమ్మచెట్లు ఎండిపోతే మీరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే దొంగలెక్కలు చెబుతున్నారన్నారు. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో పర్యటించి కరెక్టు లెక్కలను తేల్చాలని... కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాజీపేట మండలంలో విద్యుత్తు సమస్యలను అచ్చుకట్ల కరీముల్లా అధికారులు దృష్టికి తీసుకొచ్చారు.


