చెన్నూరు(వల్లూరు) : చెన్నూరు టౌన్‌లోని కేఓఆర్ కాలనీలో ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ కేసును చెన్నూరు పోలీసులు ఛేదించారు. ఆదివారం రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామంలోని చౌడమ్మ తల్లి దేవాలయంలో దొంగతనానికి యత్నించగా.. స్థానికులు గమనించి పట్టుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు తన నంబర్ ప్లేట్ లేని బైకు విడిచిపెట్టి పరారీ అయ్యాడు. స్థానికులు ఖాజీపేట పోలీసు వాళ్లకి ఫిర్యాదు చేయగా, ఖాజీపేట పోలీసు వారు వచ్చి నగలను, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన చెన్నూరు సీఐ చాంద్ బాషా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆభరణాల ఫొటోలను పోల్చి చూపించి మంగళవారం ఉదయం ఖాజీపేట పోలీసు వారికి సమాచారం ఇచ్చారు. ఖాజీపేట పోలీసు వారి దగ్గర ఉన్న ఎల్లమ్మ తల్లి ఆభరణాలను చెన్నూరు పోలీసులు తీసుకున్నారు. మొత్తం దొంగతనంలో నిందితుడు ఒక్కడే అని పోలీసులు నిర్ధారించారు. వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమంతోనే
కూటమికి మద్దతు
కడప కోటిరెడ్డిసర్కిల్ : కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలుస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అన్ని విధాలా మేలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు అందుతాయని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తారని చెప్పారు. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని, వర్షాల పరిస్థితిని పరిశీలించిన అనంతరం కరువుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, బీరం సుబ్బారెడ్డి, చేకూరి శారద, బొమ్మన సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణరెడ్డి, కళ్యాణ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
అప్పన్నపల్లిలో చోరీకి యత్నించి పట్టుబడ్డ నిందితుడు


