● పీహెచ్‌సీ స్థలంలో నిర్మాణంపై వివాదం
● గ్రామస్తుల ఆందోళన
● అధికార పార్టీకి చెందిన నేతలు ఆక్రమణకు యత్నం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఎర్రగుంట్ల మండల పరిధిలోని కలమల్ల గ్రామంలో పీహెచ్‌సీ స్థలానికి సంబంధించిన వివాదం కోర్డులో నడస్తోంది. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఈ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేపట్టడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి తన సొంత స్థలాన్ని పీహెచ్‌సీ నిర్మాణం కోసం చాలా ఏళ్ల కిందట దానం చేశారని తెలిపారు. ఈ స్థలాన్ని ప్రస్తుతం అధికారం అండతో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొందరు ఆక్రమణకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ స్థలంపై కోర్టులో కూడా వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. అయినా ఈ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేపట్టారని ఆరోపించారు. వివాదం ఉన్న స్థలంలో అధికారుల మార్కింగ్, అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్మాణ పనులు చేపడుతారని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. నిర్మాణ పనులు చేపట్టే ముందు సంబంఽధిత అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించి, హద్దులను నిర్ధారించి అధికారికంగా మార్కింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ అలాంటి ప్రక్రియ ఏదీ లేకుండానే పనులు చేయపట్టడం ఏమిటి ప్రశ్నించారు. అధికారులు కూడా స్థలం దానం ఇచ్చిన వారిపై తిట్ల పురాణానికి దిగడం దారుణమన్నారు. స్థలాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దౌర్జన్యానికి దిగడం, వారికి అండగా అధికారులు నిలవడం బాధాకరమన్నారు. ఈ వివాదంపై కలెక్టరుకు కూడా వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న వివాదం పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకుండా స్థలం యథావిధిగా ఉండేలా కొనసాగించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


