కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలోని డీఏవీ భారతి విద్యా మందిర్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల విజయనగరంలోని జీఎంఆర్‌వీ డీఏవీ పబ్లిక్ స్కూల్ (రాజాం)లో జరిగిన రాష్ట్ర స్థాయి డీఏవీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రాతినిథ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో ఢిల్లీలోని ఎన్‌సీఆర్ రీజన్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అండర్–14 విభాగంలో కె.అచ్యుత్ 800 మీటర్ల పరుగు పందెం, ట్రిపుల్ జంప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచాడని చెప్పారు. అండర్–17 బాలుర విభాగంలో ఎ.ఆదిల్ (10వ తరగతి) 800 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించారన్నారు. కె.వి. రుషి డిస్కస్‌త్రోలో ద్వితీయ స్థానంలో నిలిచాడన్నారు. అలాగే అండర్–17 బాలికల విభాగంలో ఎ.సాయి హర్షిత ట్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానం, జావెలిన్ త్రోలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నారని తెలిపారు. బి.తేజ శ్రీ డిస్కస్ త్రో లో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. వీరితోపాటు మరి కొందరు విద్యార్థులు హ్యాండ్ బాల్ తదితర పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. ప్లాంట్ హెడ్ రామమూర్తి, ఇతర ప్రతినిధులు గౌరీ పరమేశ్వర రావు, భార్గవ్‌రెడ్డి, ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు విజేతలతోపాటు పీఈటీ చందును అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో సైతం ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలన్నారు.


