మైదుకూరు : బస్సులో నరసరావుపేటకు చెందిన ఓ మహిళ మర్చిపోయిన బ్యాగ్‌ను మైదుకూరు ఆర్టీసీ అధికారులు అప్పగించిన సంఘటన మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అదే పట్టణానికి చెందిన పొన్నపల్లి కోటేశ్వరి, సిద్ధు కృష్ణమాచారి, మోటమర్రి లక్ష్మీకుమారి అనే వారు బ్రహ్మంగారిమఠం వెళ్లేందుకు మైదుకూరు డిపోకు చెందిన విజయవాడ సర్వీస్ బస్సు ఎక్కారు. వారు మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిలోని మల్లేపల్లె వద్ద దిగిపోయారు. ఆ సమయంలో కోటేశ్వరి అనే మహిళ తన వద్ద ఉన్న బ్యాగ్‌ను బస్సులోనే మర్చిపోయింది. ఆమె ఫిర్యాదుతో మైదుకూరులో బస్సులో ఉన్న బ్యాగ్‌ను డిపో ఆయిల్ డిపార్ట్‌మెంట్ డీసీసీ ఎం.లక్షుమయ్య స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్రహ్మంగారిమఠం నుండి వచ్చిన బాధితురాలికి డిపోకు చెందిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు విజయమ్మ, సరోజమ్మ, కానిస్టేబుల్ అనురాధ సమక్షంలో బ్యాగ్‌ను అప్పగించారు. బ్యాగ్‌లో రూ.8,890 నగదు, బంగారు పూసల దండ, ఇయర్ ఫోన్స్, చిన్న సెల్ ఉన్నాయని, ఆ బ్యాగ్‌ను అప్పగించిన ఆర్టీసీ అధికారులకు బాధితురాలు కోటేశ్వరి ధన్వవాదాలు తెలిపారు.


