బద్వేలు అర్బన్ : కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని గాంధీనగర్‌లో షేక్‌రుక్సానా(40) ఆమె భర్త ఖాదర్‌బాషాతో కలిసి నివసిస్తోంది. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు కాగా భర్త డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వారం రోజుల క్రితం భర్త డ్రైవర్ డ్యూటీకి వెళ్లగా రుక్సానా ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో ఉంటోంది.
అయితే కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుండే ఆమెకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఇద్దరు పిల్లలు నిద్రిస్తుండగా మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గదిలో తల్లి కనిపించకపోవడంతో మరో గదిలోనికి కిటికీ నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికుల సహకారంతో తలుపులు పగులకొట్టి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ బి.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


