● పాతాళానికి పడిపోయిన వైనం
● కొనడానికి ముందుకు రాని వ్యాపారులు
● ఆందోళనలో అన్నదాతలు
కొండాపురం : అన్నదాతలు లక్షల రూపాయల అప్పు చేసి చీనీ సాగు చేశారు. ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనంగా ఉన్నా.. ధర పాతాళానికి పడిపోయింది. దసరా వేళ పెరుగుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరు పులివెందుల, అనంతపురం మార్కెట్లకు తీసుకెళ్తున్నారు. టన్ను ధర రూ.10 వేల నుంచి 18 వేల లోపు గ్రేడింగ్ ప్రకారం ధర నిర్ణయిస్తున్నారు. సాధారణంగా తోటల చుట్టూ తిరిగే వ్యాపారులు ఈ సారి కనిపించట్లేదు. దీంతో రైతులే వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. ఫోన్‌లు చేస్తున్నా వ్యాపారులు అందుబాటులోకి రావట్లేదని వారు వాపోతున్నారు. పంటను ఎలా అమ్ముకోవాలో దిక్కుతోచక అయోమయంలో పడ్డారు. దీనికితోడు ప్రస్తుతం వర్షాలు కురవక పోవడంతో కరువు ఛాయలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల బోర్లలో నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
భారీగా పెట్టుబడి
జిల్లాలోని కొండాపురం, సింహాద్రిపురం, లింగాల, ముద్దనూరు, తొండురు మండలాల్లో దాదాపు 75 వేల ఎకరాల్లో చీనీ సాగు చేశారు. జిల్లాలో నాలుగేళ్ల కిందట చీనీ పంటకు ఆశించిన ధరలు ఉంటుండటంతో.. వ్యాపారులు తోటల వద్దనే కాయలను కొనుగోలు చేసే వారు. ఈ ఏడాది చీనీ పంటకు ఎకరాకు లక్షకు పైగా అప్పు చేసి పెట్టుబడులు పెట్టారు. దిగుబడి ఆశాజనకంగా రావడంతో.. ధర బాగా పలికితే అప్పుల నుంచి బయట పడతామని రైతులు ఆశించారు. మార్కెట్‌లో ధర పతనం కావడంతో ఊహించని షాక్ తగిలింది. పది టన్నులకు రెండు టన్నుల సూట్‌తో చీనీ టన్ను ధర రూ.18 వేల లోపే పలుకుతోంది.
గతంలో..
రెండు నెలల కిందట చీనీ ధర రూ.50 వేల నుంచి 70 వేల వరకు పలికింది. ఆ సమయంలో తోటల్లో చీనీ కాయలు లేక ధరలు పలికాయి. చీనీ కాయలు ఉన్న రైతులు అధిక ధరతో అమ్ముకున్నారు. చీనీ వ్యాపారులు అధికంగా వచ్చేవారు. తోటల చుట్టూ తిరిగే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తోటల్లో చీనీ దిగుబడి అధికంగా ఉండటంతో.. వ్యాపారుల చుట్టూ రైతులు తిరిగే పరిస్థితి తలెత్తింది. రోజురోజుకి చీనీ ధర పతనం అవుతుండడంతో.. కాయలు కోయడానికి సైతం వ్యాపారులు మొహం చాటేస్తున్నారు. దీంతో అన్నదాతలు కాయలు కొన్న వ్యాపారి కోసం పలుసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. గతంలో చీనీ కాయల కోసం తోటల వద్దకు వ్యాపారులు క్యూ కడితే.. ఈసారి వారి చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది.


