● నలుగురికి గాయాలు
మర్రిపాడు : రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను కారు ఢీకొన్న ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు సబ్‌స్టేషన్ సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు వైపు వంశీ, బ్రహ్మయ్య, కంటే ప్రసాద్‌తోపాటు ఓ చిన్నారి, మహిళ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మర్రిపాడు సబ్‌స్టేషన్ సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉంచిన విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాలువలోకి
దూసుకెళ్లిన కారు
సంగం : కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం దువ్వూరు సమీపంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నుంచి జయరామిరెడ్డి అనే వ్యక్తి ఓ పేషెంట్‌ను కారులో తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నారు. దువ్వూరు సమీపంలో కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాపర్ వైరు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రోడ్డు కోతి సమాధి సమీపంలో సురేష్‌రెడ్డి అనే వ్యక్తి షెడ్ నడుపుతూ కుటుంబాన్ని పొషించు కుంటున్నాడు. రోజు మాదిరిగానే శనివారం షెడ్‌కు వెళ్లి షాపు తెరవగా తాళాలు పగలి కొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూశాడు. షాపులో ఉన్న రూ.70 వేల విలువ గల 25 కేజీల కాపర్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పురుషొత్తమరాజు తెలిపారు.


