చక్రాయపేట : భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. మండలంలోని సురభి గ్రామం రెడ్డివారిపల్లె మాలపల్లెకు చెందిన గొంగటి రాధ(38) హత్య కేసులో నిందితుడు గొంగటి నాగార్జున అలియాస్ జి.కర్ణను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. హతురాలు రాధ, నిందితుడు నాగార్జున భార్యాభర్తలన్నారు. కొంత కాలంగా ఇద్దరి మధ్య సఖ్యత లేక పోవడం, వారి పిల్లలను భర్తకు దూరం చేయడం, ఇంటిలోకి రానివ్వక పోవడంతో నాగార్జున మనసులో కక్ష పెంచుకొని ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న రాధను కట్టెతో, రాళ్లతో కొట్టి కిరాతకంగా హత్య చేశాడని వివరించారు. ఈ కేసులో హతురాలి కుమారులు రుద్రదీప్, భరత్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రాయచోటి –వేంపల్లె ప్రధాన రహదారిపై బీటీపల్లె సమీపాన ఉన్న హెరిటేజ్ దుకాణం వద్ద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాళ్లు, కట్టెను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


