పంటల సాగు వివరాలు
కడప అగ్రికల్చర్: తెల్లబంగారం నిలువునా ఎండుతోంది. సాగుదారుల ఆశలను ‘ఎల్‌నినో’రాక్షసి ఆవిరి చేస్తోంది. ఒకప్పుడు లాభాల సిరులు కురిపించిన పత్తి చేలు.. నేడు నీరు లేక, ఎండల తీవ్రతకు అకాలంగా తెల్లబడుతున్నాయి. కీలక దశలో వరుణుడు ముఖం చాటేయడంతో పత్తిపంట ఎదుగుదల మందగించి చెట్టుకున్న పూత, కాయ రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయి. దీంతో పత్తిపై పెట్టుకున్న ఆశలు ఆవిరవుతుండగా సుమారు రూ. 10 కోట్లు పైగా పెట్టుబడులు నేలపాలయ్యే పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు.
ఖరీఫ్ ప్రారంభంలో...
ఖరీఫ్ ప్రారంభంలో తొలకరి జల్లులు పలకరించడంతో జిల్లాలో పత్తిపంటను సాగు చేశారు. కీలకమైన పూత, కాయ దశలో చినుకుజాడ కనిపించడపోవడంతో పంట ఎండిపోతోంది. ఇప్పటికే వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కళ్ల ఎదుటే ఎండిపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో పత్తి సాధారణ సాగు 22469 హెక్టార్లు గాకా అందులో 8703 హెక్టార్లలో మాత్రమే సాగైంది, ఇందులో వర్షాధారంగా 6458 హెక్టార్లలో, బోర్ల కింద 2245 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వానలకు సాగు చేసిన పత్తి పంటకు రైతులు ఎరువులు, పురుగుముందులు వినియోగించారు. తరువాత ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడంతో పంట పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది.
ఎకరాకు రూ. 12 వేల పెట్టబడి...
పత్తిపంట సాగు కోసం ఎకరాకు సుమారు రూ. 12 వేల వరకు పెట్టుబడి పెట్టారు, ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు రూ. 15 వందలు, రెండు సార్లు దుక్కుల కోసం రూ. 4 వేలు, కలుపు ఖర్చులు ఎకరాకు రూ. 3 వేలు, ఎరువులు, పురుగుముందులు రూ. 3500 ఇలా అన్ని కలిసి ఎకరాకు సుమారు రూ. 12 వేల వరకు ఖర్చు పెట్టారు. వర్షాధారంగా సాగు చేసిన పత్తి పంట ఎడుముఖం పట్టింది. నీటి ఆధారం ఉన్న చోట్ల కూడా భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లలో నీర అందక ఎండిపోతున్నట్లు పలువురు రైతలు తెలిపారు. పత్తి పంట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. పూత, పిందె, కాయలు నిలవాలంటే నేలలో తేమ అవసరం. కానీ వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ తగ్గి మొక్కలు బలహీన పడుతున్నాయి, వర్షాభావంతో పూత నిలవక, కాయలు ఏర్పడక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఎరువులు, పురుగు మందులు వాడుతున్నా వర్షాలు లేని కారణంగా ఆశించిన మేర ఫలితం రావడం లేదని పత్తి రైతులు పాపోతున్నారు.
బోర్లలో అడుగంటుతున్న జలాలు...
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్జ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫలితంగా బోర్లకు కూడా నీరు సరిగా అందడం లేదని రైతులు తెలిపారు. ఫలితంగా కొన్ని చోట్ల బోర్లలో వచ్చే అరకొర నీటితో రాత్రింబవళ్లు నీటి తడులను అందించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎండ, మరో పక్క విపరీతమైన గాలులు వీస్తుండంతో నీటి తడులు అందించినా రెండురోజులకే భూమంతా తడి ఆరి మళ్లీ పంట వాడుముఖం పడుతుందని వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితో మరో వారం పది రోజుల్లో బోర్లలో కూడా నీరు వచ్చే పరిస్థితి లేదని పలురువు రైతులు తెలిపారు.
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను చూసి రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఆశలన్నీ అడియాసలవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేవీకే శాస్త్రవేత్తలు. వ్యవసాయ అధికారులు తెలయిజేస్తున్నారు. నేలలో తేమను కాపాడుకోవడం కోసం అవసరమైన యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు.
మండల సాధారణ సాగైన విస్తీర్ణం
సాగు (హెక్టార్లలో)
వేముల 3266 2450
కమలాపురం 523 170
తొండూరు 2066 193
ఖాజీపేట 1406 155
రాజంపేట 1354 65
రాజుపాలెం 1397 106
వీఎన్‌పల్లి 1930 720
పెండ్లిమర్రి 1389 1584
పెద్దముడియం 1319 201


