పేద, సామాన్య ప్రజల ఇబ్బందులను గుర్తించి అధిక ధరలను అరికట్టాలని ఆలిండియా డెమోకట్రిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఐఎన్ సుబ్బమ్మ, ముంతాజ్ బేగంలు డిమాండ్ చేశారు. అధిక ధరలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఐద్వాఆధ్వర్యంలో మోకాళ్ళపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. జులై, ఆగస్టులో ధరలు 40 నుంచి 70 శాతం వరకూ పెరిగాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా కోశాధికారి బి.లక్ష్మీదేవి, నగర కమిటీ ఉపాధ్యక్షురాలు గౌసియా, షంషాద్, లతీఫ్, అనంతమ్మ, బీబీ, మోక్షమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.


