సుండుపల్లె : సుండుపల్లె మండలం మడితాడు గ్రామ పంచాయతీ కృష్ణారెడ్డి చెరువు వద్ద గత నెల 22న జరిగిన ఇద్దరి మృతి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నగొల్లపలోలికు చెందిన అబ్బన్నగారి జయరాం (44), రెడ్డిచెర్ల రవీంద్ర(45)లను వాహనంతో ఢీకొట్టి హత్య చేసి, ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందని సుండుపల్లె సీఐ సురేష్‌రెడ్డి, ఎస్‌ఐ మహేష్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. రవీంద్ర కుటుంబానికి, ప్రధాన నిందితుడు రెడ్డిచెర్ల శివశంకర్ కుటుంబానికి ఇంటి స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రవీంద్రను హత్య చేయాలని శివశంకర్ తన స్నేహితులతో కలిసి పథకం రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారం అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంతో జయరాం, రవీంద్రలను ఢీకొట్టి హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో సేకరించిన శాసీ్త్రయ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడంతో యెరికల శివప్రసాద్ (29), వాక శరణ్‌రాజ్ అలియాస్ చరణ్(30) శనివారం ఉదయం వీఆర్‌ఓ సమక్షంలో లొంగిపోయారు. అనంతరం వారిని సుండుపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రెడ్డిచెర్ల శివశంకర్‌తో పాటు సానిపాయికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి అశోక్‌లేలాండ్ బడా దోస్త్ వాహనం (ఏపీ39 డబ్ల్యుకె 935), సుజుకి యాక్సెస్ ద్విచక్రవాహనం (ఏపీ39 జియు2581) స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


