● అలరించిన సాంస్కృతిక నృత్యాలు
● ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
కడప సెవెన్ రోడ్స్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల పతాక సాక్షిగా ప్రతి గుండెలోనూ ’స్వాతంత్య్ర’ స్ఫూర్తి రగిలింది, దేశభక్తి ఉప్పొంగింది. ఈ పండుగ వేళ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టాయి. జిల్లా కేంద్రంలో శనివారం కనుల పండువగా సాగిన ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానం వేదికై ంది. ఇందులో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శకటాలు
వ్యవసాయం, పశుసంవర్ధక, డీఆర్డీఏ, డ్వామా – జలవనరులు, పాఠశాల విద్య – సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్, అటవీ శాఖ, ఐసీడీఎస్, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, ఆరోగ్యం, 108, 104, ఏపీఎస్పీడీసీఎల్, పోలీసు వజ్ర, నేత్ర, విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో జెడ్పీ (స్మార్ట్ కిచెన్) శకటానికి మొదటి బహుమతి, వైద్య ఆరోగ్య శాఖకు ద్వితీయ బహుమతి, డీఆర్డీఏకు తృతీయ బహుమతి, కడప నగర పాలక సంస్థకు నాల్గవ బహుమతులు లభించాయి. పోలీసు శాఖకు సంబంధించి ఎన్‌సీసీ విభాగానికి ప్రథమ బహుమతి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి ద్వితీయ బహుమతి, ఏఆర్‌ఫస్ట్ ప్లాటర్న్‌కు తృతీయ బహుమతి లభించాయి.
జిల్లా పోలీస్ శాఖ స్టాల్
జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్ధన్‌రెడ్డి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలను మంత్రికి వివరించారు. శక్తి బృందాలు, సైబర్ నేరాలు, డయల్–112, గృహ భద్రత పర్యవేక్షణ వ్యవస్థలపై పోలీస్ అధికారులు సందర్శకులకు అవగాహన కల్పించారు.


