కడప కార్పొరేషన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాన్య ప్రజల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం లభించిందని తెలిపారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయుల సేవలను, త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సమానత్వం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.
ప్రజల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందిందని, సామాన్య ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, అణగారిన వర్గాల గొంతుకగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, ఎస్‌ఏ కరిముల్లా, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, శ్రీరంజన్‌రెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ నాయక్, పవర్ అల్తాఫ్, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య, ఏ.నాగరాజు, అక్బర్ అలీ, షఫీ, వెంకట్రావ్, కేసీఆర్, పస్తం అంజి, రహీం, మహిళా నేతలు టీపీ వెంకట సుబ్బమ్మ, రత్నకుమారి, బి. మరియలు, క్రిష్ణవేణి పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శ


