సమర శంఖారావం.. స్వాతంత్య్రానికి స్ఫూర్తి దీపం | - | Sakshi
Sakshi News home page

సమర శంఖారావం.. స్వాతంత్య్రానికి స్ఫూర్తి దీపం

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గండ్రగొడ్డలిలా తాకిన ‘నేల ఉప్పు’ విప్లవం!

కోవెలకుంట్ల కదనరంగంలో

కత్తి పట్టిన వీరనరసింహుడి

సాయుధ తిరుగుబాటు

బాపూజీ పిలుపుతో ఉవ్వెత్తున ఎగసిన

శాసన ఉల్లంఘన పోరాట పతాకం

కడప సెవెన్‌ రోడ్స్‌: భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఉమ్మడి కడప జిల్లా ప్రదర్శించిన వీరత్వం, రగిలించిన విప్లవాగ్ని తెల్లదొరల గుండెల్లో శాశ్వత సింహస్వప్నమై నిలిచింది. జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునివ్వడానికి ఎన్నో దశాబ్దాల ముందే.. కడప జిల్లా చౌడు నేలల నుంచి ఉద్భవించిన ‘నేల ఉప్పు’ బ్రిటీష్‌ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిలువునా కుదిపేసింది. తమ ఉనికిని, జీవనాధారాన్ని దెబ్బతీయాలని చూసిన ఆంగ్లేయ పాలకుల నిరంకుశ చట్టాలను ధిక్కరిస్తూ స్థానిక ఉప్పు తయారీదారులు (ఉప్పర కులస్తులు) తెల్లదొరలను ముప్పుతిప్పలు పెట్టారు.కేవలం చట్టాల ధిక్కారమే కాదు, బ్రిటీష్‌ అరాచకత్వానికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ గడ్డపై రేగిన రేనాడు సూర్యుడు, వీరబ్రహ్మంగారి శిష్యుడు దొరవారి నరసింహారెడ్డి చేసిన మహాత్తర సాయుధ తిరుగుబాటు.. భావి భారత స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు ప్రేరణగా నిలిచింది. ఈ వీరత్వానికి, విప్లవ స్ఫూర్తికి అహింసా ఆయుధాన్ని జోడించేందుకు సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీజీ కడప గడ్డపై మూడు పర్యాయాలు అడుగుపెట్టారు. బాపూజీ పిలుపుతో ఉమ్మడి జిల్లా అంతటా సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్‌ ఇండియా ఉద్యమాలు దావానలంలా రగిలాయి. నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల చారిత్రక తరుణంలో, మన కడప గడ్డపై చెరగని ముద్ర వేసిన ఆ అపూర్వ సమర ఘట్టాలు మరియు మహాత్ముని అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఉప్పు..కాదు నిప్ఫు

గాంధీజీ కంటే ముందే తిరుగుబాటు: మహాత్మా గాంధీ జాతీయ స్థాయిలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి శతాబ్ద కాలం ముందే కడప జిల్లా ఉప్పు తయారీదారులు (ఉప్పర కులస్తులు) తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించారు.

బ్రిటిష్‌ ఖజానాకు గండి: చౌడు నేలల నుంచి తయారు చేసే ‘నేల ఉప్పు’ను స్థానిక ప్రజలు, పేదలు ఎక్కువగా వాడేవారు. దీనివల్ల బ్రిటీష్‌ ప్రభుత్వం ఏటా రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు భారీ ఆదాయాన్ని కోల్పోయింది.

1805 నాటి నిరంకుశ నిషేధం: ఆదాయ నష్టాన్ని తట్టుకోలేని బ్రిటీష్‌ ప్రభుత్వం 1805లో నేల ఉప్పు తయారీపై నిషేధ చట్టాన్ని తెచ్చి, 1806 నుంచి కఠినంగా అమలు చేస్తూ ఉప్పర కులస్తుల పొట్టగొట్టింది.

థార్న్‌హిల్‌ పర్యటన (1873): ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా తయారీ ఆగకపోవడంతో, బోర్డు ఆఫ్‌ రెవెన్యూ సభ్యుడు థార్న్‌హిల్‌ రాయలసీమలో పర్యటించి అధిక పన్నులు విధించినా ఫలితం లేకపోయింది.

ధరల తగ్గింపు ఎత్తుగడ: పన్నులతో లాభం లేకపోవడంతో, సముద్ర తీర ప్రాంతాల్లో పలికే తక్కువ ధరకే కడప జిల్లాలోనూ సముద్రపు ఉప్పును విక్రయించే సరికొత్త ఎత్తుగడ వేశారు.

లైసెన్స్‌ ఆంక్షలు: కొత్తగా నేల ఉప్పు బట్టీలు ఏర్పాటు చేయరాదని నిబంధనలు పెట్టి, లైసెన్స్‌ విధానాన్ని తెచ్చారు. అయితే కొత్తగా ఎవరికీ లైసెన్స్‌లు మంజూరు చేయలేదు.

అధికారిక నిషేధం (1880): మద్రాసు సాల్ట్‌ కమిషన్‌ సిఫార్సులతో 1880లో ప్రభుత్వం నేల ఉప్పును పూర్తిగా నిషేధించి, బట్టీలను ధ్వంసం చేయడానికి ప్రత్యేక సైనిక, అధికారిక బృందాలను రంగంలోకి దించింది.

శాసన ఉల్లంఘన: ఆంక్షలు ముమ్మరమైనా కడప సమీపంలోని పాలంపల్లె, మోడమీదపల్లె, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, సిద్ధవటం, బద్వేల్‌, రాయచోటి, పులివెందుల తదితర ప్రాంతాలలో నేల ఉప్పు తయారీ ఆగలేదు. కడప వీరులు బ్రిటీష్‌ చట్టాలను ధిక్కరిస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టారు.

జాతిపిత పాదస్పర్శతో పునీతం

జాతీయోద్యమ ప్రేరణ: ఆనాటి ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాగించిన సాయుధ తిరుగుబాటు భావి భారత జాతీయోద్యమానికి ఎంతో ప్రేరణనిచ్చింది.

మొదటి పర్యటన (1921 సెప్టెంబరు 30): తిరుపతి సభ ముగించుకుని రేణిగుంట నుంచి రైలులో రాజంపేట మీదుగా గాంధీజీ కడపకు చేరుకున్నారు.

కరువు నిధి విరాళాలు: రాయలసీమ కరువు సహాయం కోసం కడపలో జరిగిన సభకు 40 వేల మంది రాగా, ప్రజలు ‘స్వరాజ్య నిధి’ కింద అపారమైన విరాళాలు ఇచ్చారు.

వస్త్ర దహనం – హరిసర్వోత్తమరావు అనువాదం: గాంధీజీ ప్రసంగాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించగా, ఉత్తేజితులైన ప్రజలు విదేశీ వస్త్రాలను కుప్పలుగా పోసి తగులబెట్టారు.

రెండో పర్యాయం (1929 మే 17): హిందు–ముస్లింల ఐక్యత, అంటరానితనం నిర్మూలన లక్ష్యంగా గాంధీజీ తన సతీమణి కస్తూర్బాతో కలిసి జిల్లాకు వచ్చారు.

రూట్‌ మార్చి ప్రసంగాలు: తాడిపత్రి నుంచి వస్తూ కొండాపురం, మంగపట్నం, ముద్దనూరు, చిలంకూరు, ఎర్రగుంట్ల గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రొద్దుటూరు సభ: రాత్రి ప్రొద్దుటూరు చేరుకున్న గాంధీ దంపతులకు ప్రజలు ఘనస్వాగతం పలికి, ఖద్దరు నిధికి రూ. 1,730ల నగదుతో పాటు బంగారు కానుకలను సమర్పించారు.

మూడో పర్యటన (1934 జనవరి 1): అస్పృశ్యత నివారణ ధ్యేయంగా వచ్చిన గాంధీజీకి శెట్టిగుంట, రాజంపేట రైల్వేస్టేషన్లలో వేలాది మంది స్వాగతం పలికారు.

‘శాంతినికేతన్‌’లో బస: కడప ఏడు రోడ్ల కూడలి సమీపంలోని సమరయోధుడు దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఇల్లైన ‘శాంతినికేతన్‌’లో జాతిపిత బస చేశారు.

కార్మిక కాలనీల సందర్శన: కడపలో ఖద్దరు ఎంపోరియంను ప్రారంభించిన బాపూజీ, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల కాలనీల్లో పర్యటించి మున్సిపల్‌ హైస్కూలు మైదాన సభలో అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement