జాతీయ స్థాయిలో కడప ఐపీఎస్‌ల హవా! | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో కడప ఐపీఎస్‌ల హవా!

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

టాప్‌–100 ఐపీఎస్‌ల జాబితాలో

ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌,

రాయచోటి బిడ్డ రాఘవేంద్ర

ఫేమ్‌ ఇండియా–ఏసియా పోస్ట్‌ ఎంపికలో ఇరువురికీ దక్కిన అరుదైన గౌరవం

సాక్షి ప్రతినిధి, కడప: జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రతిష్టాత్మక ఉత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌తో పాటు, ఉమ్మడి జిల్లావాసి, ఒడిశాలోని ఝార్సుగూడ ఎస్పీగా పనిచేస్తున్న గుండాల రెడ్డి రాఘవేంద్ర భారతదేశంలోని అత్యుత్తమ ఐపీఎస్‌ల జాబితాలో చోటు సంపాదించారు. ప్రముఖ సర్వే సంస్థలైన ఫేమ్‌ ఇండియా–ఏసియా పోస్ట్‌ సంయుక్తంగా ప్రకటించిన భారతదేశంలోని 100 మంది ఉత్తమ పోలీసు చీఫ్‌ల జాబితాలో వీరు స్థానం కై వసం చేసుకోవడంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సమర్థవంతమైన పోలీసింగ్‌, నేర నియంత్రణ, పారదర్శకత, ప్రజల విశ్వాసం మరియు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తీరును ప్రామాణికంగా తీసుకుని ఈ ఎంపిక జరిగింది.

ఆధునిక సాంకేతికతతో కడప ఎస్పీ నవశకం

కడప జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణతో పోలీసింగ్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్‌ ఆధారిత పోలీసింగ్‌, సైబర్‌ నేరాల నియంత్రణ, వృత్తిపరమైన దర్యాప్తు వంటి ఆధునిక విధానాల ద్వారా క్లిష్టమైన కేసుల్లో పురోగతి సాధించారు. మహిళలు, బాలలభద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ ప్రజాదరణ పొందారు.

ఒడిశాలో రాయచోటి బిడ్డ రాఘవేంద్ర రికార్డులు

ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటికి చెందిన ఐపీఎస్‌ అధికారి గుండాల రెడ్డి రాఘవేంద్ర ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ ఎస్పీగా రికార్డు స్థాయి విజయాలు నమోదు చేశారు. ఆయన నాయకత్వంలో ఝార్సుగూడ పోలీసులు జిల్లా ప్రగతి డాష్‌బోర్డ్‌లో ఒడిశా రాష్ట్రంలోనే నంబర్‌వన్‌ స్థానం సాధించారు. తప్పిపోయిన పిల్లలను 95.7 శాతం మేర సురక్షితంగా రికవరీ చేయడం, తీవ్రమైన హత్యలు, ఏటీఎం దోపిడీల కేసులను ఛేదించడం, పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో ఆయన ప్రతిభ కనబరిచారు.

బాధ్యత మరింత పెరిగింది: ఐపీఎస్‌ అధికారులు

భారతదేశంలో టాప్‌–100 ఐపీఎస్‌ అధికారుల జాబితాలో జిల్లా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌, రాయచోటి బిడ్డ రాఘవేంద్రలకుఒకేసారి చోటు లభించడం ఉమ్మడి కడప జిల్లాకు దక్కిన అరుదైన గౌరవమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ అధికారులు నచికేత్‌ విశ్వనాథ్‌, రాఘవేంద్ర ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం సమాజం పట్ల తమకున్న బాధ్యతను మరింతగా పెంచిందని వివరించారు.

నచికేత్‌ విశ్వనాథ్‌ గుండాల రెడ్డి రాఘవేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement