రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్సు (జీఎఫ్‌సీ) సబ్జెక్టును గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోగా కార్యాలయ పనిదినాల్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రామాంజనేయులు శుక్రవారం పేర్కొన్నారు. ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్, ఎంఏ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అప్‌లైడ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ సబ్‌జెక్టులలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.అభ్యర్థులు తమవెంట విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకురావాలని తెలిపారు.
ఆలస్యంగా నడిచిన ఏపీ
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
రాజంపేట: జిల్లాలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఆలస్యంగా నడిచింది. నందలూరు–రేణిగుంట మార్గంలోని మామండూరు రైల్వేస్టేఃన్ సమీపంలో రైలు ఫార్మిసిన్‌లోని ఎస్1 బోగీలో చక్రాల వద్ద పొగ వచ్చింది. ప్రయాణికులు ఇటీవల రైల్వేలో జరుగుతున్న ఫైర్ సంఘటనలతో ఆందోళన చెందారు.బ్రేక్‌బైడింగ్ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తిన క్రమంలో పొగ వచ్చింది. పొగ వల్ల ఎటువంటి ప్రమాదం లేకపోయినా సిబ్బంది అప్రమత్తయ్యారు. సమస్యను పరిష్కరించారు. అనంతరం రైలును కదలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్: కడపలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)కు సంబంధించిన డిగ్రీ ప్రథమ సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత, పరీక్షల నియంత్రణాధికారి డా. ప్రకాశ్ నారాయణ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు 655 మంది రాయగా వారిలో 556 మంది అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారని, 85 శాతం సగటు ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను కళాశాల పరీక్షల వెబ్‌సైట్ skrgcwaexams.inలో లాగిన్ అయి తెలుసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.
17న ఈశ్వరీదేవి
జయంత్యుత్సవం
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలు శ్రీ ఈశ్వరీదేవి జయంత్యుత్సవం ఈ నెల 17న జరగనుంది. ఇందుకోసం ఈశ్వరీదేవి మఠం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం తెల్లవారుజామున నుంచి సుప్రభాత సేవ, కలశతీర్థం, అభిషేకం, కుంకుమార్చన, హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం అష్టోత్తర(108) కలశాలతో భక్తజనం ఊరేగింపుగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వరకు వెళ్లి, పూజలు జరుపుతారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ ఉంటుంది. రాత్రి ఊయలసేవ, గ్రామోత్సవం ఉంటాయి.ఈ కార్యక్రమాలను శ్రీ మఠాధిపతులు వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో మఠం సిబ్బంది నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తపాలాశాఖ ప్రత్యేక సేవలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా విదేశాల్లో ఉన్న సోదరులు, బంధువులు, ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు పంపేందుకు భారత తపాలా శాఖ అంతర్జాతీయ పార్సిల్, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి. రాజేష్ తెలిపారు. శుక్రవారం కడపలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న రాఖీ పౌర్ణమి జరుపుకోనున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు, నిబంధనల ప్రకారం అనుమతించిన వస్తువులను విదేశాలకు పంపించుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సమీపంలోని బ్రాంచ్ పోస్టాఫీసు ద్వారా కూడా విదేశాలకు రాఖీలు, బహుమతులు పంపించుకునే సౌకర్యం ఉందన్నారు.


