భక్తులు ఆకలితో వెళ్తే ఎలా !
● సౌమ్యనాథాలయంలో
అన్న ప్రసాదం కరువు..
● టీటీడీ చర్యలు తీసుకోవాలని
భక్తుల విన్నపం
గరుడ వాహనంపై
సౌమ్యనాథుడు
నందలూరు : సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్‌కుమార్ నిర్వహించారు. అనంతరం స్వామివారు మోహినీఅలంకారంలో శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సౌమ్యనాథ స్వామి శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై విహరించారు. గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తు లు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
రాజంపేట: అక్కడ అడుగుపెట్టగానే రాజసం ఉట్టిపడే గోపురం కనువిందు చేస్తుంది.. మూలవిరాట్‌ను దర్శించుకోగానే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది.. చరిత్రకు నిలువుటద్దం ఆ ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వైష్ణవాలయం.. అదే చోళుల కాలంలో నిర్మితమైన నందలూరు సౌమ్యనాథాలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్నూలు, తిరుపతి నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి నిండైన భక్తిభావంలో మునిగిపోతారు.
పిడికెడు అన్న ప్రసాదం కరువు...
చరిత్రకు ఘనకీర్తిగా... ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా అలరారుతున్న ఈ ఆలయంలో అన్న ప్రసాదం కరువైంది. నిండైన భక్తితో ప్రదక్షిణలు చేశాక.. చుట్టూ చూస్తే పిడికెడు భుక్తి కానరాక ఆకలితోనే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయాల వద్ద ఆకలి అనే మాటకు చోటులేకుండా 56 ఆలయాల్లో మార్చి నుంచి రెండుపూటలా అన్నదానం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అన్న ప్రసాదాలను వడ్డించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కానీ, నందలూరులోని సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదం మాటే కరువైంది. ఇదివరకు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు స్థానికంగానే దాతలు, భక్తులు ట్రస్టు పేరిట ఆలయంలో అన్నప్రసాదం చేసేవారు. టీటీడీలోకి విలీనమైన తర్వాత బయటివారు అన్న ప్రసాదాలు చేయడానికి వీల్లేదన్న అధికారుల సంకేతాలతో ఆ కార్యక్రమాలు ఆగిపోయాయి.
కేంద్ర పురావస్తుశాఖ అడ్డుపుల్ల!
ఆలయానికి ప్రతి రోజూ వందలాది మంది భక్తులు వస్తారు. శనివారం రోజైతే ఆ సంఖ్య రెట్టింపవుతుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తజనంతో ఆలయ ఆవరణ కిటకిటలాడుతోంది. అన్నప్రసాదం లేకపోవడం భక్తకోటి ఆకలితోనే వెనుదిరుగుతోంది. కాగా సౌమ్యనాథాలయంలో ఒక్క పూటైనా అన్నప్రసాదం పంపిణీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చినా కేంద్రపురావస్తు శాఖ అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారి ఒకరు కేంద్రపురావస్తుశాఖకు అన్నప్రసాదాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి అనుమతులు వచ్చి.. ఆపై టీటీడీ వెనువెంటనే అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు చేపడితే భక్తుల భుక్తి బాధలు తప్పినట్లే. కాగా, బ్రహ్మో త్సవాలలో కల్యాణం ఒక్క రోజు అన్న ప్రసాద పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలను అందచేయాలి. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసేందుకు జిల్లా నుంచే కాకుండా అనేక జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారికి సకాలంలో ఆకలి తీర్చేందుకు అ న్నప్రసాదాల పంపిణీ దోహదపడుతుంది. టీటీడీ చర్యలు తీసుకోవాలి. – శివపార్వతి, భక్తురాలు, ముద్దనూరు
సౌమ్యనాథాలయానికి వచ్చిన భక్తులు ఆకలితో వెనుదిరిగితే ఎలా. ఒంటిమిట్టలో మాదిరి ఒక పూట పెట్టినా భక్తుల ఆకలి తీరుతుంది. చాలా మంది భక్తులు నందలూరు బస్టాండుకెళ్లి భోంచేస్తున్నారు. అలా కాకుండా ఆలయంలో అన్నప్రసాదాలు పెడితే బాగుంటుంది కదా. – వల్లకొండు పద్మావతి, భక్తురాలు


