రాజులను చూస్తూ పెరిగాను..
వారి రాజ్యానికి కీర్తినై వెలిగాను..
కలెక్టర్ల కదలికను కళ్లారా చూశాను..
రాజ్యాంగ పాలనకు వెలుగై నిలిచాను..
ఇప్పుడు నేనే చిమ్మ చీకట్లో
బిక్కుబిక్కుమంటున్నాను..
చిరు దీప కాంతుల కోసం
ఆశగా ఎదురుచూస్తున్నాను..
ఎన్నో ఉత్తర్వులకు సాక్షినైన నేను..
ఇప్పుడేమో ఉత్త చేతులతో మిగిలిపోయాను...
చారిత్రక సంపదగా ఖ్యాతిగాంచిన నేను..
ఇప్పుడిలా మొండి గోడలుగా... చెత్త దిబ్బలుగా నిలువెల్లా ‘ఖండమై’ మిగిలాను..
నేనంటే చిరుద్యోగులకు ఇష్టం..
నా నీడే ఉపాధి గనక..
జర్నలిస్టుల ముచ్చట్లకు అప్పుడు నేనే వేదిక ..
ఇప్పుడిక్కడ ముచ్చట్లు కరువై..
పురుగూపుట్ర తిరుగుతున్నాయ్..
సమస్యల మబ్బులు పట్టి..
మందుబాబుల బూతులే వినిపిస్తున్నాయ్..
ఎందరో నేతలు
నా ముంగిట రాజకీయ వ్యూహాలు
పదును పెడుతుంటే చూసిన రోజులు ఉన్నాయ్..
మరెందరో కలెక్టర్లు
నా కళ్లెదుటే గొప్ప గొప్ప ఉత్వర్వులు ఇస్తుంటే చూసి ఆనందించిన క్షణాలూ ఉన్నాయ్..
ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే
ఉప్పొంగిపోతాను...
ఆ మరుక్షణమే ఇదిగో
ఇలా నన్ను నేను చూసుకుని కుంగిపోతాను..
ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోశాను..
ఎంతోమంది నిరసనకారులకు
లీడర్లయ్యేలా ఉత్సాహాన్ని నూరిపోశాను..
కష్టాల్లో ఉన్న నన్ను ‘ఊపిరి’ పోయలేరా!
నన్ను కాపాడుకోవడానికి
ఉద్యమమై ముందుకు రాలేరా!
కడప నగర నడిబొడ్డున ఉన్నానని
మురిసిపోని రోజంటూ లేదు..
నిత్యం జనసందోహాన్ని చూసి
సంతోషించని క్షణమంటూ లేదు..
ఇప్పుడూ.. అక్కడే ఉన్నా..
ఎక్కడో దూరంగా విసిరేసినట్లు.. మౌనంగా!
సమాజం నుంచి వెలివేసినట్లు.. దీనంగా!
పాత నీరు పోవాల్సిందే..
కొత్త నీరు రావాల్సిందే..
అలాగని ఒడ్డు దాటాక ఓడ తగలేస్తామా!
అప్పుడెప్పుడో ..
నాకు కొత్త అందాలు పూయడానికి...
మెరుగులు దిద్దడానికి
నిధులేమో ఇచ్చారని తెలిసి ఆనందించాను..
పనులు చేపట్టగానే ‘పాత రోజులొస్తున్నాయని’ గాల్లో తేలిపోయాను..
కొద్ది రోజులకే పనులు ఆపేశాక...
ఆపై పట్టించుకోవడం లేదని మానేశాక..
నా ఆశలు.. ఆకాంక్షలు
దూది పింజల్లా గాల్లోకి ఎగిరిపోయాయి..
ఇదిగో..
బంట్రోతు మొదలు కలెక్టరు దాకా
ఎందరో అధికారులకు నీడనిచ్చింది నేనే కదా...
అలుపొచ్చినప్పుడు చల్లగా విశ్ర మించింది
నా ఒళ్లోనే కదా!
వయసు మీద పడి ‘శిథిలమవుతుంటే..’
చూస్తూ ఊరుకోవడం న్యాయమా!
నిలువునా నన్ను గాయపరుస్తున్నా
చూస్తుండిపోవడం ధర్మమా!
అయినా ‘పాత’దంటూ కలెక్ట‘రేట్’ కడుతుంటే...
కాంట్రాక్టర్‌తో అధికారులే కుమ్మక్కవుతుంటే..
చూస్తూ ఊరుకుంటారా..!
నాకేమీ బతకాలని లేదు..
నేను మీ గత చరిత్రకు జ్ఞాపకమని
గుర్తు చేస్తున్నా..
రేపటితరానికి వారసత్వ సంపదని
తెలియపరుస్తున్నా...!
ఓ పర్యాటక అభిమానీ నీకే..
మాటలతో.. ఉత్తుత్తి ప్రకటనలతో వద్దు..
చిత్తశుద్ధితో రా.. ఉద్యమమై రయ్..రయ్.. రా..!
ఇదిగో కలెక్టరు సారూ..
మీ ఒక్క ‘సిరా’సంతకం..
నా మరో వందేళ్ల వసంతం...
చేస్తారని ఆశిస్తున్నా.. – మీ పాత కలెక్టరేట్..
(కడప సెవెన్‌రోడ్స్)
సభా భవనం వద్ద
చెత్తాచెదారాలు, వ్యర్థాలు
పాత కలెక్టరేట్ చాంబర్ వద్ద పేరుకుపోయిన ఇసుక, మట్టి, ఇతర వ్యర్థాలు


