టీడీపీ నేతల దుశ్శాసన పర్వంపై మహిళాలోకం కన్నెర్ర చేసింది.. రాత్రింబవళ్లు తేడా లేకుండా .. చిన్నారులు.. వృద్ధులన్న కనికరం లేకుండా ఆకృత్యాలకు తెగబడుతున్న కూటమి నేతల తీరును దునుమాడింది. మహిళల మాన.. ప్రాణాలు గాల్లో కలుస్తున్నా..మౌనంగా చూస్తున్న కూటమి పెద్దల తీరును ఎండగట్టింది. మంగళవారం వైఎస్సార్, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మహిళలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప అంబేడ్కర్ సర్కిల్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన
● మహిళల మాన, ప్రాణాలకురక్షణ లేదు : ఎమ్మెల్యే దాసరి సుధ
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కూటమి ప్రభుత్వంలో మహిళల మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బద్వేల్ శాసన సభ్యురాలు దాసరి సుధ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం పిలుపు మేరకు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి సుధ మాట్లాడుతూ కుప్పం, తిరుపతి, గుంటూరు, బద్వేల్‌లో మహిళలపై జరిగిన దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. బద్వేల్‌లో స్థానికంగా ఉంటున్న వృద్ధ దంపతులపై టీడీపీ నాయకులు ఎక్కడి నుంచో వచ్చి దౌర్జన్యం చేయడం అన్యాయమని మండిపడ్డారు. అయినా పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై కేసు పెట్టకుండా ఇరువర్గాలపై కేసులు పెట్టడం రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. ఈఘటలకు హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భారీ బందోబస్తు: వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్‌లో నిర్వహించిన నిరసన సందర్భంగా డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అరగంటలోనే నిరసన పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారు.


