పులివెందుల : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు అనేక బూటకపు హామీలను చంద్రబాబు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారన్నారు. మహిళలకు కల్పించాల్సిన భద్రతను కూడా విస్మరించారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఎంపీని కలిసిన దస్తావేజు లేఖరులు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పులివెందులకు చెందిన దస్తావేజు లేఖరులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీతో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రభుత్వ జీవో 396ను రద్దు చేయడానికి సహకరించాలని ఎంపీకి విన్నవించారు. దీనికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్పందిస్తూ మీ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ ప్రైవేటీకరణ దుర్మార్గం
కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు దుర్మార్గమని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీని ఆర్టీసీకి సంబంధించిన పలువురు ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ ప్రైవేటీకరణ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎంపీకి విన్నవించుకున్నారు. దీనికి ఎంపీ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థకు, ఉద్యోగులకు మేలు చేసే విధంగా వైఎస్ జగనన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభు త్వం అందుకు విరుద్ధంగా ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే అనైతిక కార్యకలాపాల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు.
పెద్ద నాన్నను పరామర్శించిన ఎంపీ
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి స్థానిక దినేష్ నర్సింగ్ హోం (గంగిరెడ్డి ఆసుపత్రి)లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన పెద్ద నాన్న వైఎస్ ఆనంద్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


