కడప రూరల్ : శిశు మరణాల నివారణకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో శిశుమరణాలపై ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. పలు సూచనలు చేశారు. డాక్టర్ అరిఫుల్లా, డాక్టర్ మొహమ్మద్ తాహ, డాక్టర్ హిరేంద్ర సింగ్, డిప్యూటీ డెమో ప్రసన్న లత, సిహెచ్‌ఓ మునిరెడ్డి పాల్గొన్నారు.
జనం కోసం జగన్ ‘యాప్’
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురైన ప్రజలు తమ గొంతుకను వినిపించేందుకు వీలుగా జగన్ 2.0 సూపర్ యాప్‌ను తమ పార్టీ తీసుకొచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా తెలిపారు. అధికార పార్టీ నేతల వల్ల ఎవరైనా ప్రజలు ఇబ్బందులకు గురైతే ఆ విషయం యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. తమ పార్టీ అండగా నిలబడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైనా ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. ముఖ్యంగా మహిళలకు రక్షణే లేకుండా పోయిందన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే సోషల్ మీడియాపై కేసులు నమోదు చేయడం శోచనీయమన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు షఫీ, రమేష్ రెడ్డి, తోటకృష్ణ, ఎస్‌ఎల్‌ఎస్ గౌస్‌పీర్, బసవరాజు, రామకృష్ణారెడ్డి, పాల్గొన్నారు.
జీవో 396 రద్దు చేసేదాకా పోరాటం
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 396ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు రెండవ రోజు బుధవారం సామూహిక రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్‌ఎస్కేలు ఏర్పాటు చేయడం అంటే దస్తావేజు లేఖరుల వ్యవస్థను పూర్తిగా తొలగించడమేనని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి జరుగుతుందని మీ పేటీఎం బ్యాచ్ వారితో చెప్పించి అధికారులు డాక్యుమెంట్ రైటర్లు కుమ్మక్కై సమ్మె నిర్వహిస్తున్నారని చెప్పించడం సరైంది కాదన్నారు. అవినీతికి కూటమి ప్రభు త్వం మారుపేరని రాష్ట్ర ప్రజలకు ఈ రెండేళ్లలోనే అర్థమైందన్నారు. తక్షణమే జీవో 396 రద్దుచేసి రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–19 మెన్ మల్టీడే మ్యాచ్‌లు మూడవ రోజు డ్రాగా ముగిశాయి. కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన కర్నూలు, కడప జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. కడప జట్టులోని ధీరజ్‌కుమార్‌రెడ్డి 5 వికెట్లతో రాణించాడు. వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.
ఇసుక క్వారీలపై విచారణ
చక్రాయపేట : పాపాఘ్ని నదిలోని ఇసుక క్వారీలపై కడప డీఆర్వో మల్లికార్జునుడు విచారణ చేపట్టారు. మండలంలోని కుమార్లకాల్వ గ్రామ మాజీ సర్పంచ్ కొవ్వూరు శ్రీధర్‌రెడ్డి పాపాఘ్ని నదిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్‌జీజీలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎన్‌జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ మైనింగ్ శాఖల అధికారులు, కలెక్టర్ ఆదేశాలతో డీఆర్వో మంగళవారం విచారణ నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా సుమారు కిలోమీటరు మేర నదిలో నడస్తూ ఇసుక తవ్వడంతో ఏర్పడ్డ గుంతలను చూసి ఆశ్చర్య పోయాడు. విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళతానని చెప్పాడు. కార్యక్రమంలో మైనింగ్ డీడీ ఇన్‌చార్జ్ సుబ్రమణ్యం, పర్యావరణ శాఖ ఇంజనీరింగ్ అధికారులు శంకరరావు, సుధ, తహశీల్దారు విజయకుమారి పాల్గొన్నారు.


