దోపిడీ మాకు చట్టబద్ధం! | - | Sakshi
Sakshi News home page

దోపిడీ మాకు చట్టబద్ధం!

Jul 22 2026 1:23 AM | Updated on Jul 22 2026 1:23 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో పచ్చ నేతల అక్రమ మైనింగ్‌ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జిల్లాలోని వేముల, వేంపల్లె మండలాలు ప్రస్తుతం అక్రమ మైనింగ్‌ తవ్వకాలకు ప్రధాన అడ్డాగా మారాయి. స్థానిక టీడీపీ ముఖ్య నేతల అండదండలతో, పక్కా ప్రణాళికతో కోట్ల రూపాయల విలువైన ముగ్గురాయి (బైరెటీస్‌) సంపదను యథేచ్ఛగా దోచేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల, గొందిపల్లె, తాళ్లపల్లె, కత్తులూరు, కొత్తపల్లె ప్రాంతాల్లో బైరెటీస్‌ నిల్వలు ఉండగా, వేముల కేంద్రంగా ఈ దోపిడీ పర్వం బహిరంగంగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు.

ఎన్సీఎల్టీ ఖనిజం అపహరణ..

ఈ అక్రమ మైనింగ్‌ దౌర్జన్యాలు ఎంతవరకు వెళ్లాయంటే, నేషనల్‌ కంపెనీ ఆఫ్‌ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) ద్వారా వేలంలో ఎంబసీ గ్రూపు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఖనిజాన్ని సైతం వదల్లేదు. టిఫెన్‌ బైరెటీస్‌ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన దాదాపు రూ. 10 కోట్ల విలువైన 3,500 టన్నుల ముగ్గురాయిని సంక్రాంతి పండుగ సాకు చూసుకుని ఒకే రాత్రిలో పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి తరలించుకుపోయారు. ఈ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు కంపెనీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా, అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు పేర్ల శేషారెడ్డి అండ్‌ కో తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. కంపెనీ ప్రతినిధులను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, ‘తలకాయలు తీస్తాం‘ అంటూ బహిరంగంగా ప్రాణ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఖాకీలు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

లీజులున్నా దౌర్జన్యాలు.. వాటాల పంపకాలు

ఒకవైపు అనుమతులు లేని 41 ప్రాంతాల్లో అనధికారికంగా తవ్వకాలు జరుపుతుండగా, మరోవైపు అధికారికంగా లీజు అనుమతులు ఉన్న మైనింగ్‌ నిర్వాహకులను సైతం తెలుగు తమ్ముళ్లు వదలడం లేదు. ‘మా కనుసన్నుల్లోనే మైనింగ్‌ జరగాలి.. మాకు సగం వాటా ఇవ్వాల్సిందే, లేదంటే తవ్వకాలు ఆపేయండి‘ అంటూ లీజుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దౌర్జన్యంగా వెలికితీసిన ముగ్గురాయిని స్థానిక పల్వరైజింగ్‌ మిల్స్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చిన కోట్లాది రూపాయల అక్రమ సంపాదనను లీడర్ల స్థాయిని బట్టి వాటాలుగా పంచుకుంటున్నారు.

కూలీ ప్రాణం బలి..

కేసు మమ అనిపించిన పోలీసులు

అక్రమ మైనింగ్‌లో నిబంధనలు గానీ, కూలీల భద్రత గానీ పూర్తిగా శూన్యం. కేవలం ఖనిజం వెలికితీసి కోట్లు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకులు కార్మికుల ప్రాణాలను గాలికొదిలేశారు. వేంపల్లె మండలం కత్తులూరు కేంద్రంగా సాగుతున్న అక్రమ మైనింగ్‌లో రక్షణ చర్యలు లేకపోవడంతో, అమ్మయ్యగారిపల్లెకు చెందిన చిట్టిబోయిన రామచంద్ర (52) అనే కూలీ దుర్మరణం పాలయ్యాడు. ఈ దారుణాన్ని మైనింగ్‌ ప్రమాదంగా కాకుండా కేవలం ట్రాక్టర్‌ ప్రమాదంగా చిత్రీకరించి కప్పిపుచ్చారు. ఇందులో ఓ ప్రముఖ టీడీపీ నేత సమీప బంధువు ఉండటంతో స్థానిక పోలీసులే రంగంలోకి దిగి, బాధిత కుటుంబంతో బేరసారాలు కుదిర్చి కేసును మమ అనిపించడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

నిమ్మకు నీరెత్తిన మైనింగ్‌, జిల్లా యంత్రాంగం

ఈ అక్రమ మైనింగ్‌ దందాపై స్థానిక మీడియా క్షేత్రస్థాయి ఆధారాలతో ఘోషిస్తున్నా జిల్లా కలెక్టర్‌, భూగర్భగనుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలివెళ్లిన ఖనిజం ఏ మిల్లులకు వెళ్లిందో, ఆయా కంపెనీల్లో ఉన్న స్టాకు రికార్డులను పరిశీలిస్తే లూఠీ వ్యవహారం నిగ్గుతేలే అవకాశం ఉన్నా అధికారులు ఆ చొరవ చూపడం లేదు. కేవలం కంటితుడుపు చర్యగా 2024–25లో 15 కేసులు నమోదు చేసి రూ.7.46 లక్షలు, 2025–26లో 31 కేసులు నమోదు చేసి రూ.24.07 లక్షల జరిమానా వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు కేవలం 280 మెట్రిక్‌ టన్నుల బైరెటీస్‌ను మాత్రమే సీజ్‌ చేశారు.ఇసుక అక్రమ రవాణాలోనూ అదే తంతుకేవలం ముగ్గురాయే కాకుండా, జిల్లాలోని పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు, చిత్రావతి నదులే కేంద్రంగా ఉచిత ఇసుక మాటున భారీ దోపిడీ సాగుతోంది. ఎలాంటి అధికారిక ఇసుక రీచ్‌లతో నిమిత్తం లేకుండా అనధికారికంగా రీచ్‌లు ఏర్పాటు చేసుకొని ప్రధాన పట్టణాలకు తరలిస్తున్నారు. కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఇసుక దందాతో భారీగా లబ్ధి పొందుతున్నారు. ప్రకృతి సంపద నిలువునా కొల్లగొట్టుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.

త్వరలోనే దాడులు చేస్తాం

వేముల, వేంపల్లె పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారాలు మా దృష్టికి వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ప్రత్యేక బృందాలతో అక్రమ మైనింగ్‌ స్థావరాలపై దాడులు నిర్వహిస్తాం. అక్రమార్కులు ఎంతటి వారైనా సరే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

– సుబ్రమణ్యం, మైనింగ్‌ ఏడీ

అక్రమ మైనింగ్‌లో చెలరేగుతున్న పచ్చ నేతలు

వేముల, వేంపల్లె మండలాలు అక్రమ మైనింగ్‌కు నిలయాలు

పక్కా ప్రణాళికతోనే కోట్ల విలువైన ముగ్గురాయి, ఇసుక లూటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement