కడప కోటిరెడ్డిసర్కిల్ : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 ప్రిలిమినరీ–2026 పరీక్షలకు అర్హులైన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల గడువును జులై 25 వరకు పొడిగించినట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 30 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 97031 85382, 98499 19221 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
బాధ్యతల స్వీకారం
కడప అర్బన్ : కడప రిమ్స్ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నూతన సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ ఈ.బి.దేవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం ఇటీవల కడపకు బదిలీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమెను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డితో పాటు వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–1 శ్రీకాంత తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
టీచర్లు వృత్తినైపుణ్యం
పెంచుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : మారుతున్న సిలబస్‌కు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ కాగిత శ్యాముల్, డీఈవో షేక్ షంషుద్దీన్ సూచించారు. శనివారం కడప జయనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో కడప, బద్వేల్, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్ల పరిధిలోని సోషల్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ’టీచర్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్’ శిక్షణా తరగతులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నుండి 8వ తరగతుల నూతన సిలబస్, కరికులంతో పాటు విద్యాబోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, టీచర్ హ్యాండ్ బుక్, అసెస్‌మెంట్ బుక్‌లెట్, మిషన్ మార్చ్, క్లిక్కర్స్ వంటి సరికొత్త అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పీలు గంగాధర్, సురేష్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌పీలు నిత్యానందరెడ్డి, ఫిరోజ్‌బాష, రజని తదితరులు పాల్గొన్నారు.
బయో మెడికల్ వేస్టేజ్
నిబంధనలను పాటించాలి
– డీఎంహెచ్‌ఓ యుగంధర్
కడప రూరల్ : బయో మెడికల్ వేస్టేజ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ తెలిపారు. శనివారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో ’స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ’బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ, నమోదు’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు ఎక్కువ వ్యర్థాలు, చెత్త విడుదలవుతుంటే, వాటిని అక్కడికక్కడే తడి, పొడి చెత్తగా విడదీసి బాధ్యతాయుతంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పనకు సమిష్టిగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిపుల్లా, నేషనల్ హెల్త్ మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ తాహా, డెమో భారతి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి విజయ భాస్కర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా కేసుల్లో కొత్త కోణం
కడప రూరల్ : జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో, కొత్త వేరియంట్ బయటపడింది. ఓమిక్రాన్ కు చెందిన ఆర్‌ఎఫ్ 5 రకానికి చెందినదిగా నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. కాగా పాజిటివ్ కేసుకు సంబంధించిన వారి నమూనాలను, వ్యాధి తీవ్రత, ఇతర కారణాలను తెలుసుకోవడానికి పూణేకు పంపారు. అందులో నలుగురికి ఓమిక్రాన్ ఆర్‌ఎఫ్ 5 వేరియంట్ ఉందని నిర్ధారించారు. కాగా ఆర్‌ఎఫ్ 5 వేరియంట్ సాధారణ రకానికి చెందినదిగా వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.
లక్షణాలు ఇవీ: గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్ళు నొప్పులు ఆర్‌ఎఫ్ 5 వేరియంట్ లో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవారు తక్షణం చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి. అలాగే తప్పనిసరిగా, ముందు జాగ్రత్తగా ప్రజలు మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.


