రాజంపేట : రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త అధునాతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. రాజంపేట తో పాటు గుంతకల్ డివిజన్ పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లను అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకువస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల కెమెరాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది.
రూ.20 కోట్లతో నిఘా నేత్రాలు..
గుంతకల్ డివిజన్ పరిధిలో మొత్తం 150 రైల్వేస్టేషన్లు ఉండగా, ప్రయాణికుల రద్దీ, భద్రతా ప్రమాణాల ఆధారంగా అధికారులు 109 రద్దీ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే శాఖ రూ.20 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యాధునిక ఏఐ సీసీ కెమెరాలను అమర్చుతోంది. తొలి విడతగా 70 కీలక రైల్వే స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
అసాంఘిక శక్తులను ఇట్టే పసిగట్టేస్తాయి!
● ఈ కెమెరాలు సాధారణ వాటిలా కాకుండా అత్యంత పదునైన సాంకేతికతతో పనిచేస్తాయి.
పాత నేరస్థుల గుర్తింపు : గతంలో రైళ్లలో చోరీలు, దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుల ముఖాలను ఇవి ఇట్టే గుర్తుపట్టి అలర్ట్ చేస్తాయి. ఎలాంటి అసాంఘిక శక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు స్టేషన్ పరిసరాల్లోకి ప్రవేశించినా క్షణాల్లో డేటా రికార్డ్ అయి కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది.
నెల రోజుల భారీ బ్యాకప్..
గతంలో ఉన్న పాత కెమెరాలకు సంబంధించిన విజువల్స్ కేవలం 10 రోజులు మాత్రమే నిల్వ ఉండేవి. కానీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక వ్యవస్థ ద్వారా ఏకంగా నెల రోజుల (30 రోజులు) పాటు భారీ డేటా బ్యాకప్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల పాత నేరాల దర్యాప్తు చాలా సులభం కానుంది. ఈ కెమెరాల నిత్య పరిశీలన కోసం ఆర్‌పీఎఫ్ పోలీస్ స్టేషన్‌లలో ప్రత్యేక కంట్రోల్ యూనిట్‌లను ఏర్పాటు చేశారు. రైల్వే రక్షక దళం అధికారులు 24 గంటల పాటు ఈ నిఘా నేత్రాలను పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌ల నుంచి పూర్తి రక్షణ కల్పించనున్నారు.
రూ.20 కోట్లతో
గుంతకల్ డివిజన్ వ్యాప్తంగా కెమెరాలు


