● నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు
● గడువులోగా ఫలితాల వెల్లడిపై సందేహాలు?
కడప ఎడ్యుకేషన్ : పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్) ఆధునికీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత వ్యవస్థ ప్రారంభ దశలోనే సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటోంది. నెట్‌వరర్క్ లోపాలు, సర్వర్ అంతరాయాలు, పరికరాల పనితీరులో సమస్యల కారణంగా మూల్యాంకన ప్రక్రియ కొంత ఆలస్యమవుతోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా సుమారు 28154 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన మూల్యాంకన పక్రియ ఈ నెల 6వ తేదీ నుంచి కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1,95,674 సమాధాన పత్రాలు జిల్లాకు వచ్చాయి. మూల్యాంకనాన్ని ఏప్రిల్ 15లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాధ్యమా అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో డిజిటల్ ఆటోమేషన్‌ను ప్రవేశపెట్టి లక్షల రూపాయల వ్యయంతో ట్యాబ్‌లు, సాంకేతిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు లక్షలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేసినప్పటికీ, స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఈనెల 6వ తేదీన ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ సాంకేతిక ఆటంకాల కారణంగా ఆలస్యంగానే కొనసాగుతోంది. దీంతో అయ్యవార్లు ఆందోళనకు గురవుతున్నారు.
ట్యాబ్‌ల పనితీరుపై అందోళన..
ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌లు సరిగా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ కావడం, నెట్‌వర్క్ అంతరాయాలు వంటి సమస్యల వల్ల మార్కుల నమోదు ప్రక్రియ అనుకున్న మేర జరగడం లేదు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉన్నప్పటికీ మొదటి రోజున సగటున 20 పత్రాలకే పరిమితమయ్యారు. మూల్యాంకనం అనంతరం ప్రతి జవాబు పత్రాన్ని స్కాన్ చేసి ట్యాబ్‌లో మార్కులు నమోదు చేయాల్సిన ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన మార్కులను నమోదు చేసే బాధ్యతను ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక అసిస్టెంట్లకే పరిమితం చేయడం వల్ల పనిలో వేగం తగ్గింది. సాఫ్ట్‌వేర్ పరిమితుల కారణంగా ఇతరులు నమోదు చేయలేకపోవడం వల్ల జాప్యం నెలకొందన్న వాదనలున్నాయి. సాధారణంగా ఉదయం ప్రారంభమయ్యే మూల్యాంకనం సాంకేతిక సమస్యల వల్ల రాత్రి వరకు కొనసాగుతోంది. రోజువారి మూల్యాంకనం సాయంత్రానికి ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం పూర్తికాకపోవడంతో కొన్నిసార్లు జవాబు పత్రాలను మళ్లీ భద్రతా గదులకు తరలిస్తున్నట్లు తెలిసింది. మొదట ఏప్రిల్ చివరికల్లా ఫలితాలను ప్రకటించాలని భావించారు.అయితే సాంకేతిక లోపాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టడం అవసరమే అయినప్పటికీ, దానికి తగిన మౌలిక వసతులు, సమర్ధవంతంగా అమలు చేయలేకపోతే ఆశించిన ఫలితాలు సాధ్యం కావనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మూల్యాంకన ప్రక్రియను సజావుగా కొనసాగించడం విద్యాశాఖకు సవాల్ మారింది.


