హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐ

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలం మాలేపాడుకు చెందిన నరసింహులు 2024 డిసెంబర్‌ 3న తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, అలివేలు మంగాపురం మెట్ల దారిలో దారుణ హత్యకు గురి కావడం పాఠకులకు తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చంద్రగిరి పోలీసులు నిందితులైన సీటీఎం గ్రామానికి చెందిన నాగరాజు, మాలేపాడుకు చెందిన కత్తి నరసింహులు, మునిరాజ, నారాయణస్వామి లను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు పోలీసులకు చిక్క కుండా పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి చంద్రగిరి సిఐ సురేష్‌ కుమార్‌ తన సిబ్బందితో ఆదివారం మదనపల్లె మండలానికి వచ్చారు. సిబ్బంది నిందితుల కోసం ఒక వైపు గాలిస్తుండగా సిఐ పాత ముద్దాయిలను స్థానిక తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు పిలపించి విచారణచేశారు. త్వరలోనే తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.

కార్మికుల సమస్యలపై పోరాటం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని పాత రిమ్స్‌లో సీఐటీయూ 10వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఒకపక్క ప్రభుత్వంతోనూ మరోపక్క యాజమాన్యంతోను పోరాటం చేయడంలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సరైన వేతనాలు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారం రాకముందు ప్రస్తుత ఉన్నటువంటి పాలకులు కార్మిక వర్గానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా చేయడం దారుణమని ఘాటుగా విమర్శించారు. సీఐటీయూ 17 వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు జరిగే మహాసభలకు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మనోహర్‌, శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి

మదనపల్లె టౌన్‌ : మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. స్థానిక తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొన్నేటి పాళ్యం పంచాయతీ, బెంగళూరు రోడ్డులోని చిప్పిలికి చెందిన వీరభద్ర (55) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిద్దైపెన పడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడక పోవడంతో అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు బాధితున్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement