ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని కోల్ ప్లాంట్‌లో ఉన్న లైనర్ ప్లేట్లు (ఇనుప ప్లేట్లు) చోరీకి గురయ్యాయి. వీటిని స్టేజీ–1లోని విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. కోల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ముద్దనూరుకు చెందిన సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు అదివారం తెల్లవారుజామున మూడు లైనర్ ప్లేట్లను దొంగతనం చేసి స్కూటీలో తీసుకెళుతుండగా ఆర్టీపీపీ విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్ తన సిబ్బందితో కలసి పట్టుకొన్నారు. స్కూటీని, ఇనుపప్లేట్లను కలమల్ల పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. కలమల్ల ఎస్‌ఐ మాట్లాడుతు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఒంటిమిట్ట : మండలపరిధిలోని పెద్దకొత్తపల్లిలో శనివారం పలుకూరు మురళి(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు...మురళి తనకున్న భూమితో పాటు ఇతరులకు చెందిన భూములు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాల్లో చామంతి సాగుచేశాడు. పూలకు గిట్టుబాటు ధరలేక నష్టం వచ్చింది. అప్పుల భారం పెరిగింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక పొలంలోనే విషద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మురళిని 108 సహాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, నలుగురు సంతానం ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
మృతదేహం
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గతనెల 24వ తేదీన గుర్తు తెలియని మహిళ (36) అనారోగ్యంతో వైద్యసేవలకు వచ్చింది. ఈనెల 10వ తేదీన మృతి చెందింది. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రిమ్స్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కురబలకోట : మండలంలోని తెట్టు వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.మునిరాజ తెలిపారు. ఆదివారం ధ్వజా రోహణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 17న కల్యాణోత్సవం, అదే రోజు రాత్రి గరుడోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 18న తేరు ఉత్సవం జరుగుతుందని తెలిపారు.


