కడప ఎడ్యుకేషన్ : వైఎస్ అవినాష్‌రెడ్డి పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ తవ్వా వెంకటయ్య డాక్యుమెంటరీ రూపొందించారు. ఏడు నిమిషాలు నిడివిగల డాక్యుమెంటరీని సోమవారం మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ వర్తమాన రాజకీయ నేతలలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో బయట ప్రపంచానికి తెలియ చెప్పడానికి దీనిని రూపొందించామన్నారు. షర్మిల కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ‘నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది‘అన్నట్లు వైఎస్ అవినాష్‌రెడ్డి కడప జిల్లా ప్రజలకు గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలిసేలోపు ఆయన గురించి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..వీటిని ఖండిస్తూ ఆయన గురించి వాస్తవాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తవ్వా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి, గౌరవ అతిధిగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆత్మీయ అతిథిగా మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారని చెప్పారు.


