పండుగ వాతావరణంలో గండికోట ఉత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ‘గండికోట ఉత్సవాల‘ ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తమ వంతు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని పీజీఆర్‌ఎస్ హాలులో గండికోట ఉత్సవాల ఏర్పాట్ల ప్రణాళిక పై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గండికోట భౌగోళిక స్వరూపాన్ని మరింత ప్రాచు ర్యంలోకి తీసుకురావడం జిల్లా వాసులుగా మన అందరి బాధ్యత అన్నారు. వాస్తవికంగా చూస్తే కడప అనేది స్వచ్ఛమైన ప్రేమకు, ఆప్యాయత, అనురాగానికి ప్రతీక అన్నారు.
గొప్ప సంస్కృతికి పుట్టినిల్లయిన కడప జిల్లా స్వభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ గండికోట ఉత్సవాలు చక్కటి వేదిక కావాలని కోరారు. గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించిన మ్యాపులను ఈవెంట్ మేనేజర్లు ప్రదర్శించగా..కలెక్టర్ వాటిపై పలు సూచనలు, సలహాలను అందించారు. జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో కళాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు.. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ అంశాలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రత్యేకించి టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 11, 12, 13 తేదీల్లో నిర్వహణ
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


